- పకడ్బందీగా కార్యక్రమం నిర్వహించాలి
- పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్పించాలి
- విద్యార్థుల ప్రతిభపై వీడియోస్ రూపొందించండి..
- వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేయండి
- ప్రైవేటుకు దీటుగా తయారు చేయాలి..
- కలెక్టర్ పమేలా సత్పతి
నేటి సాక్షి, కరీంనగర్: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ల్పాఠశాలల్లో పెద్ద ఎత్తున విద్యార్థులను చేర్పించాలని, బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. పద్ధతి ప్రకారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో బడిబాట కార్యక్రమం నిర్వహణపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బడిబాట కార్యక్రమంపై పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన బడిబాట కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంటికి వెళ్లి బడీడు పిల్లలను గుర్తించి వారి వివరాలు సేకరించాలని పేర్కొన్నారు. వారు ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా కృషి చేయాలని తెలిపారు. అలాగే ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి ఐదో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతోనూ సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదువుకొని అప్గ్రేడ్ అవుతున్న ఐదు నుంచి ఆరు సంవత్సరాల ఉన్న చిన్నారులను అందరిని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం విజయవంతమైతే ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ, విద్యా బోధన, ఆటపాటలు, ప్రత్యేక కార్యక్రమాలు, విహార యాత్రలపై షార్ట్ వీడియోలు 2, 3 రోజుల్లో రూపొందించాలని ఆదేశించారు. వాటిని అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు పంపడంతో పాటు వివిధ గ్రూపుల్లో పెద్ద ఎత్తున షేర్ చేయాలని సూచించారు. దీనిపై విద్యాశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కిచెన్ షెడ్డు, టాయిలెట్స్ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, ఈ మేరకు ఈజీఎస్ ద్వారా నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఈ నెల 10వ తేదీ వరకు పాఠ్యపుస్తకాలు అందించడంతోపాటు యూనిఫామ్స్ విద్యాశాఖ అధికారులు సిద్ధం చేసి ఉంచాలని సూచించారు. పాఠశాలల్లో శానిటేషన్ సంబంధించిన పనులు చేపట్టాలని పేర్కొన్నారు. పాఠశాలల అభివృద్ధికి సంబంధించి అన్ని వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం తక్కువ ఉన్నచోట పెంచేలా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. జులైలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు షూస్ అందించే ఏర్పాట్లు చేస్తానని వెల్లడించారు. అంగన్వాడీ కేంద్రాలను సైతం మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రతిభ గల ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను గుర్తించాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, జడ్పి సీఈఓ శ్రీనివాస్, డీపీఓ రవీందర్, డీఆర్డీఓ శ్రీధర్, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, ఇన్చార్జి మెప్మా పిడి స్వరూపారాణి, తదితరులు పాల్గొన్నారు.