- పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి
- లక్ష్యసాధనలో ఎంత కష్టమైనా భరించాలి
- కలెక్టర్ పమేలా సత్పతి
నేటి సాక్షి, కరీంనగర్: ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను వినియోగించుకొని విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ధన్గర్వాడీ ఉన్నత పాఠశాలలో మ్యూజిక్, డ్రాయింగ్, టైలరింగ్తో పాటు వివిధ అంశాల్లో శిక్షణ పొందిన విద్యార్థులతో శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలని సూచించారు. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఉంటే జీవితంలో సాధించలేనిది ఏమీ ఉండదని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్పై విద్యార్థులు ప్రత్యేక సారించాలని సూచించారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించే క్రమంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయవద్దని, ముందుకు సాగాలని సూచించారు. ఒడిదుడుకులను తట్టుకున్నప్పుడే విజయాలను ఈజీగా సాధించవచ్చని పేర్కొన్నారు. కలలకు ఎలాంటి అడ్డంకులు, ఆంక్షలు ఉండవని, వాటిని సాధించుకోవాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉండాలన్నారు. ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యను అభ్యసించినప్పటికీ విద్యాశాఖ అద్వర్యంలో 42 రోజులు ధన్గర్ వాడీ పాఠశాలలో నిర్వహించిన శిక్షణ ద్వారా సంగీతం, చిత్రలేఖనం వంటి అదనపు బోధన తరగతులకు హాజరైన విద్యార్థులను కలెక్టర్ అభినందించారు. ఇంజినీరింగ్ విద్యార్థులు సంగీతం శిక్షణకు వంటి ప్రాధాన్యం ఇవ్వడం చాలా సంతోషం కలిగించిందన్నారు. జీవన ప్రయాణంలో ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని గ్రహించాలని, ఎన్ని అడ్డంకులు, ఎదురైనా కలలను నిజం చేసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులు నేర్చుకున్న సంగీతాన్ని వినిపించడంతో పాటు వారు తయారు చేసిన పేపర్ పూలకుండీలు, డ్రాయింగ్స్ మొదలైనవి కలెక్టర్ కు బహూకరీంచారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో పవన్ కుమార్, కోర్స్ డైరెక్టర్ గొట్టే ప్రమోద, కోర్స్ ఇన్చార్జి ఏనుగు ప్రభాకర్ రావు, ఇతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.