నేటి సాక్షిసంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి భాగ్యవతి తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న బాలుర సమీకృత వసతి గృహంపై వెలువడిన వార్తల నేపథ్యంలో ఆదివారం వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో మాట్లాడి భోజన సరఫరా, త్రాగునీరు, వసతి, వంటశాల ఏర్పాట్లను పరిశీలించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి మాట్లాడుతూ వసతి గృహంపై వెలువడిన వార్తల నేపథ్యంలో వసతి గృహాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించడం జరిగిందని, హాస్టల్ స్థాయిలో పర్యవేక్షణ, సమన్వయంలో తాత్కాలిక లోపం కారణంగా భోజన సరఫరా, కొంతమంది ప్రాథమిక సౌకర్యాలలో అంతరాయం ఏర్పడినట్లు గమనించడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టడం జరిగిందని, విద్యార్థులకు నిరంతర భోజన సరఫరా, శుద్ధమైన త్రాగునీరు, వసతి, వంటశాల నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం వసతి గృహంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, సంబంధిత వసతి గృహ సంక్షేమ అధికారి, సిబ్బందిని కఠినంగా హెచ్చరించడం జరిగిందని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే బాధ్యులపై శాఖా పరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు జరిగిన సంఘటనకు బాధ్యులైన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.





