(నేటి సాక్షి )దూలపల్లి,నవంబర్ 13:తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యురాలు కందాడి జ్యోత్స్న శివారెడ్డి గురువారం దూలపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. విద్యా ప్రమాణాలు, విద్యార్థుల అభివృద్ధి, మరియు పాఠశాలల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులను సమీక్షించారు.ఈ సందర్భంగా జ్యోత్స్న శివారెడ్డి పాఠశాలల్లోని తరగతి గదులు, వంటగది సౌకర్యాలు, పారిశుధ్య వ్యవస్థ, తాగునీటి సదుపాయాలు, మధ్యాహ్న భోజన పౌష్టిక ప్రమాణాలను పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతను తనిఖీ చేసి, సిబ్బందితో భోజన వంట విధానాలపై చర్చించారు.తరగతి గదుల్లో విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభ్యాస స్థాయి, బోధన పద్ధతులపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థుల అభిప్రాయాలు విని, విద్యా ప్రమాణాల మెరుగుదలకు తగిన సూచనలు ఇచ్చారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులతో సమావేశమై, విద్యార్థుల హాజరు, పాఠ్యపుస్తకాల వినియోగం, పాఠశాల నిర్వహణపై సమీక్ష జరిపారు. పాఠశాల పరిశుభ్రత, విద్యార్థుల ఆరోగ్యం, డిజిటల్ విద్యా వసతులపై మరింత శ్రద్ధ చూపాలని సూచించారు.ఈ పర్యటనలో విద్యా శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం అవసరమైన సదుపాయాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.





