నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 23 ~అన్నమయ్య జిల్లా :-: జిల్లాలో అవినీతికి పాల్పడిన ఏపీఎస్పీడీసీఎల్ ఇంజనీర్ సత్యమూర్తి ఏసీబీ అధికారుల వల్లో చిక్కాడు. గాలివీడు మండలానికి చెందిన ఏపీఎస్పీడీసీఎల్ ఇంజనీర్ సత్యమూర్తి, తన కారు డ్రైవర్‌తో కలిసి రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గాలివీడు మండల కేంద్రమైన ఎగువగొట్టివీడు గ్రామపంచాయతీ కుమ్మరపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే రైతు 2024 లో పొలంలో విద్యుత్ నియంత్రిక కోసం ట్రాన్స్ఫార్మర్, కరెంట్ పోల్స్, వైర్లు మంజూరు చేయాలంటూ ఏపీఎస్పీడీసీఎల్ కు అర్జీ పెట్టుకున్నాడు. డిపాజిట్ చెల్లించాడు. విద్యుత్ అధికారికి కఠిన రసీదు చూపించాడు. ఇవన్నీ త్వరగా మంజూరు చేయాలంటే చెయ్యి తడపాల్సిందేనని ఇంజనీర్ సత్యమూర్తి డిమాండ్ చేశాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ఏఈ వద్దకు తిరుగుతూ బతిమాలాడు. ఆ అధికారి కనికరించలేదు. ఆఖరికి విసుకు చెంది దిక్కుతోచని బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళికతో ఏసీబీ అధికారులు సోమవారం రాయచోటి పట్టణంలోని వై జంక్షన్ శివాలయం వద్ద పెట్రోల్ బంక్ వద్ద వల పన్ని రూ.15 వేల లంచం తీసుకుంటున్న సమయంలో ఇంజనీర్ సత్యమూర్తి తో పాటు కారు డ్రైవర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ దాడికి ఏసీబీ డీఎస్పీ సీతారామారావు నేతృత్వం వహించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. వీరిని ఏసీబీ అధికారులు ఎస్పీఎం కార్యాలయానికి తరలించి రాత్రంతా సోదాలు నిర్వహించారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి డ్రైవర్ శ్రీనివాసులు, అధికారి సత్యమూర్తి లను అరెస్టు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే జీతాలు సరిపోదన్నట్టు రైతుల వద్ద కూడా లంచాలు తీసుకుంటున్న లంచగొండి అధికారులకు కొంచమైన సిగ్గుండాలి. పంటలు సరిగా పండక అరకొరగా పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక రైతులు కన్నీటి చుక్క కారుస్తూ అల్లాడుతుంటే ఇలాంటి అవినీతి అధికారులకు రైతులంటే పెద్ద బిజినెస్ మ్యాన్ లు అయినట్టు వారి వద్దనే లంచాలు డిమాండ్ చేయడం సిగ్గుచేటు. రైతులు చెమటోడ్చి శ్రమ పడి పంటలు సాగు చేస్తుంటే ఇలాంటి రైతుల వద్ద లంచం తీసుకోవడం సిగ్గు చేటు. ఇలాంటి అవినీతి అధికారిని చూసైనా మరికొంత మంది లంచగొండి అధికారులు బుద్ధి తెచ్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు..~~~~~~~~~~~~~~~~





