*నేటి సాక్షి, ఎండపల్లి:* మామిడి పూత ఈసారి రైతులకు ఆశాజనకంగా కనిపిస్తోంది. పూత పూత మామిండ్లు పూత మామిండ్లు అనే జానపద గేయం గుర్తుకు వచ్చేలా మామిడి తోటలు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. సాధారణంగా డిసెంబర్-జనవరి మాసాలలో పూసినట్లే మామిడి చెట్లు విరగపూసాయి. గత ఏడాది ఆశించిన పంట దిగుబడి లేకా రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. కాగా ఈసారి పూసిన పూతను చూస్తుంటే అదే స్థాయిలో కాత కాస్తుందని తద్వారా అధిక దిగుబడి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే మామిడి పంట పూతతోనే ప్రారంభమైన చివరి కాత కాసేదాక కాపాడుకోవాలని మరోవైపు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక పూత ఉన్న సమయంలో తేనె మంచు, తెగుళ్లు, తామర పురుగు ప్రభావం పూతపై పడి రాలిపోయే ప్రమాదం ఉందని రైతులు అప్రమత్తంగా ఉండి నివారణకు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఉద్యానవన శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇలా ఉంటే పకృతి వైపరీత్యం దేవుడెరుగు.





