Tuesday, March 17, 2026

*వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై నిరసన ‘గళం’..!**– తిరుచానూరులో నిరసన ర్యాలీ చేపట్టిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి**– చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా తరలి వచ్చిన నేతలు**– రెండేళ్లలో 2450 ఎంబీబీఎస్‌ సీట్లు కోల్పోయిన వ్యిదార్థులు**– చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ యువత*

నేటి సాక్షి తిరుపతి(బాదూరు బాల) గత ప్రభుత్వంలో కట్టించిన వైద్య కళాశాలలను ప్రభుత్వం తరపున నిర్వహించకుండా పీపీపీ పద్దతిలో ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం సంకల్పించడంతో అందుకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్‌సీపీ నేతలు నిరసన గళం వినిపించారు. కేంద్ర పార్టీ కార్యాలయం ఇచ్చిన ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుచానూరు ఘంటశాల విగ్రహం నుంచి పంచాయతీ కార్యాలయంకు వరకు భారీ ర్యాలీ జరిగింది. అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న నిరసన ర్యాలీకి చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు గ్రామలలోని ఘంటశాల విగ్రహం వద్దకు చేరుకున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిరసనలను హోరెత్తించారు. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రభుత్వం తరపున మెడికల్‌ కాలేజీలను నిర్వహించడం చేతకాకుండా ప్రైవేటీకరణ చేయాలని చూడటం వారి∙చేతకాని తనానికి నిదర్శనమని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం పేదలకు వైద్య విద్య, మెరుగైన వైద్యాన్ని దూరం చేయడానికి కంకణం కట్టుకుందని, అందులో భాగమే మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయమని పార్టీలోని పలువురు ముఖ్య నేతలు ఆరోపించారు. ముందుగా చంద్రగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డిలు పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరినీ పలుకరించి ర్యాలీకి సన్నద్ధం చేశారు. అనంతరం ఘంటశాల విగ్రహం నుంచి బయలుదేరిన ర్యాలీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు చేతబట్టుకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి మాట్లాడుతూ అమరావతి నిర్మాణం చేయడానికి లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కేవలం 5వేల కోట్లు ఖర్చు పెట్టి వైద్య కళాశాలలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేరా..? అని ప్రశ్నించారు. అదేమీ పెద్ద సమస్య కాదని, పేదలకు వైద్య విద్యను దూరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుట్రలో భాగమే ప్రైవేటీకరణ అంశమన్నారు. కమీషన్ల కోసం ప్రభుత్వ నిధులతో నిర్మించిన మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పెడుతున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వంపై రాజకీయ కక్షలు పెట్టుకుని ఆ ప్రభుత్వంలో వైఎస్‌ జగన్‌ నిర్మించిన మెడికల్‌ కాలేజీలను అలాగే వదలేశారని, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారన్నారు. అలా చేయడం వల్ల రెండేళ్లలో 2450 ఎంబీబీఎస్‌ సీట్లును ఏపీకి చెందిన విద్యార్థులు కోల్పోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సరైన భవనాలు లేకున్నా అనుమతులు తెచ్చుకుని మెడికల్‌ కాలేజీలను నిర్వహిస్తుంటే ఏపీలో వున్న భవనాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారన్నారు. తక్షణం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే జగనన్న నాయకత్వంలో ప్రజా ఉధ్యామన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. *ప్రభుత్వ తీరుపై యువత మండిపాటు*మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ అంశంపై ప్రభుత్వ తీరును యువత తిరస్కరిస్తూ అనేక రకాల విమర్శలతో మండిపడ్డారు. సీఎం డౌన్‌.. డౌన్‌.. ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి.. మెడికల్‌ కాలేజీలను ప్రభుత్వమే నిర్వహించాలి.. చేతకాని సీఎం డౌన్‌..డౌన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టడం వల్ల పోలీసులు అప్రమత్తమై సర్దుబాటు చేసే ప్రయత్నం చేసినప్పటికీ నాయకులు, కార్యకర్తలు వినిపించుకోక మరింత గట్టిగా అరుస్తూ ముందుకు కదిలారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంకు చేరుకుని అక్కడ విధులు నిర్వహించే పంచాయతీ ఈఓ మణికి వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News