నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 19~అన్నమయ్య జిల్లా :- వైసీపీ నేతలంతా ప్రస్తుతం ఒక పని అయిపోయిందని రిలాక్స్ గా ఉన్నారు. ఆ పనేంటంటే కోటి సంతకాల సేకరణ. ఈ కార్యక్రమం ఒక విధంగా వైసీపీని కొంత మేరకు కదిలించింది. అక్టోబర్ 1 నుంచి మొదలుపెట్టిన ఈ కార్యక్రమం డిసెంబర్ 18న గవర్నర్ ను కలసి అధినేత జగన్ కోటి సంతకాల పత్రాలను సమర్పించడంతో ముగిసింది. ఈ కార్యక్రమాన్ని వైసీపీ ఒక గ్రాండ్ సక్సెస్ గా జరుపుకుంది. ఓ పండుగ వాతావరణంలా ముగిసింది. ప్రజలు ఈ కీలకమైన అంశం మీద పూర్తి పాజిటివ్ గా స్పందించారని వైసీపీ అగ్ర నేతలు పేర్కొంటున్నారు. జగన్ అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని కూడా స్పష్టం చేశారు.కనెక్ట్ అయిన ఇష్యూ :విద్య వైద్యమన్నవి సాధారణంగా ప్రజలకు కనెక్ట్ అయ్యే అంశాలే. ఇక ఏ రాజకీయ పార్టీ ఏ రకమైన కార్యక్రమాలు చేసినా నూటికి నూరు శాతం జన సహకారముండదు. అయితే అటెన్షన్ పెట్టే హాట్ ఇష్యూ అయితే మాత్రం జనంలో చర్చ సాగుతోంది. ఆ విధంగా ప్రభుత్వ రంగంలోకి వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి కూటమి చూస్తోందన్న వైసీపీ ఆరోపణలు కానీ విమర్శలు కానీ జనంలోకి ఎంతో కొంత వెళ్ళాయి. దాంతో ఈ విషయంలో వైసీపీలో సంతృప్తయితే ఉంది.తరువాత ఏముంది :వైసీపీ విపక్షంలో ఉంది. అందువల్ల ఆ పార్టీ నిరంతరం ప్రజలలో ఉండాలి. ఆందోళనలు చేపట్టాలి. ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడాలి. అయితే అందులోనే కీలకం ఉంది. అన్ని అంశాలు జనాలను కదిలించలేవు. రాజకీయంగా తేలిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే సగటు జనం సమస్యలను పట్టుకోవాలి. అవి కూడా కోటి సంతకాల సేకరణ మాదిరిగా దీర్ఘకాలం జనంలో నలిగేలా ఉండాలి. అంటే వాటికి అంతటి పొటెన్షియాలిటీ ఉండాలన్న మాట. మరి ఆ రకంగా చూస్తే సాగలేక సాగుతున్న కూటమి పాలనలో ఏ ఏ అంశాల మీద జనంలో వ్యతిరేకత ఉందో అధ్యయనం చేయాల్సి ఉంది. అర్జంటుగా కావాలి :వైసీపీ అధినాయకత్వమయితే క్యాడర్ ని రిలాక్స్ గా ఉంచకూడదని ఆలోచిస్తోంది. అలా ఉంచితే కనుక మళ్ళీ కదపడం ఒకింత కష్టమవుతోందని భావిస్తోంది. అయితే సరైన ఇష్యూస్ లేకుండా జనంలోకి వెళ్తే బూమరాంగ్ అవుతుందని ఉంది. అందుకే వైసీపీ ఆచీ తూచీ వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం మీద నిశిత పరిశీలన జరుపుతోంది. అయితే కూటమి ప్రభుత్వం ఏ రకమైన చాన్స్ వైసీపీకి ఇస్తుందన్న దాని మీదనే ఇదంతా ఆధారపడి ఉంది. కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగానే ఉంటోంది. జనాలకు ఆశలు పోలేదు :అయితే పాలసీల మీదనే వైసీపీ కొన్ని సందర్భాలలో పోరాడాల్సి ఉంది. సూపర్ సిక్స్ హామీల మీద ఆందోళన చేసినా పెద్దగా క్లిక్ కాదు. వాటి మీద జనాలకు ఇంకా ఆశలు పోలేదు. దాంతో రాజధాని కానీ పోలవరం కానీ మాట్లాడాలంటే ఇబ్బంది అవుతుందని అంటున్నారు. భూములను పందేరం చేస్తున్నారని అన్నా కూడా అది సైతం రివర్స్ అవుతుంది. ఎందుకంటే అభివృద్ధి కోసమే భూములు ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. ప్రజలు కూడా దానికి ఓకే అనే సీన్ ఉంటుంది. మొత్తానికి చూస్తే వైసీపీలో ఎంతో కొంత ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ సరైన ఇష్యూస్ తో జనంలోకి రాకపోతే ఇబ్బంది అవుతుందన్న విశ్లేషణలు ఉన్నాయి. ~~~~~~~~~~~~~~~~~~





