నేటి సాక్షి, బాపట్ల జిల్లా ప్రతినిధి (అద్దంకి)వ్యవసాయానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయం లాభసాటిగా మార్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. సంతమాగులూరు మండలం కొమ్మలపాడు గ్రామంలో సోమవారం నిర్వహించిన రైతన్న సేవలో మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు. ఇందులో భాగంగా అద్దంకి నియోజకవర్గంలోని రైతులతో మంత్రి గొట్టిపాటి సమావేశం అయ్యారు. ఇటీవల విడుదల చేసిన అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారులతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతీ రైతుకు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏటా రైతుల అకౌంట్లలో విడతల వారీగా రూ.20 వేలు జమ చేస్తున్నామని అన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 46.85 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ పథకం అమలుకు ఏటా ప్రభుత్వం రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని అన్నారు. ఇనాం భూములు ఉన్న రైతులకు గత ప్రభుత్వం రూ.7 వేలు ఇచ్చిందని.. కానీ కూటమి ప్రభుత్వం వారి ఖాతాల్లో రూ.14 వేలు జమ చేస్తోందని పేర్కొన్నారు. *విద్యార్థులకు ఉచితంగా సైకిళ్ల పంపిణీ* అద్దంకి మండలం నాగులపాడు గ్రామంలో నిర్వహించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న 37 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేశారు. NREDCAP, Assist అనే సంస్థల సహకారంతో ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. ప్రభుత్వ పాఠశాల విద్యను ప్రోత్సహించే దిశగా దాతలు ముందుకొచ్చి సైకిళ్లను అందించడం అభినందించదగిన విషయమని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాలకు దూరం కాకుండా, తరగతులకు గైర్హాజరు కాకుండా ఉండేందుకు, డ్రాపౌట్ల సంఖ్య తగ్గించేందుకు సీఎస్ఆర్ నిధుల సహాయంతో ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లను ఉచితంగా అందిస్తున్నామని ఆయన చెప్పారు. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని వివిధ ఉన్నత పాఠశాలలకు చెందిన సుమారు 5 వేలకు పైగా విద్యార్థులకు ఇప్పటి వరకు సైకిళ్లను ఉచితంగా అందించామని మంత్రి గొట్టిపాటి వెల్లడించారు. ఇందులో అద్దంకి జూనియర్ కళాశాల విద్యార్థుల కూడా ఉన్నారని గుర్తు చేశారు.*కమ్యూనిటీ హాలు ప్రారంభం*అనంతరం నాగులపాడు గ్రామంలో రూ.30 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రారంభించారు. స్థానికులకు అంకితం ఇచ్చారు. గ్రామ ప్రజల సామూహిక అవసరాలను తీర్చే వేదికగా ఈ కమ్యూనిటీ హాల్ నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ప్రజల నుండి నేరుగా అర్జీలు స్వీకరించిన మంత్రి.. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.





