Monday, December 23, 2024

‘శత’గోపం..!!

  • మంచోళ్లే.! కానీ..
  • మందిని ‘ముంచి’పోయిండ్రు.!!
  • రూ.20.కోట్లతో ఉడాయించిన ‘జువెల్లరీ వ్యాపారి’
  • 20 ఏండ్ల నమ్మకాన్ని ‘సొమ్ము’ చేసుకుని పరారీ
  • రో 8 మంది ‘బోర్డు తిప్పేందుకు’ తయారు.!?
  • మెట్ పల్లి లో రూ.100కోట్ల కు ఐపీ.. జనాలకు ‘కుచ్చుటోపీ’


(Radarapu Narsaiah-9440011066)

నేటి సాక్షి, కోరుట్ల : ‘నమ్మి నానవోత్తె-పుచ్చి బుర్రలు చేశారన్న’ సామెతను నిజం చేస్తున్నారు కొందరు ‘నమ్మకమైన వ్యాపారులు’.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో ‘జువెల్లరీ’ మార్కెట్లో..వాళ్లంతా పేరుమోసిన బ్రాండ్ అంబాసిడర్ లు.!
వృత్తి నైపుణ్యంలో ‘పనోళ్లు’..!! వ్యాపారంలో ‘నమ్మకస్తులు’.. తెసినోళ్లందరికీ చాల ‘మంచోళ్లు’..కానీ.. ఇప్పుడు వాళ్లను ‘నమ్మి’నోళ్లందరికీ దాదాపు రూ.100.కోట్ల విలువైన ‘కుచ్చుటోపీ’పెట్టి కుటుంబాలతో సహా ఉడాయించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు సమాచారం.
దీనికి ‘ఐపీ’ నోటీసులు పంపించి బిచాణా ఎత్తివేసేందుకు పక్కా స్కెచ్ వేసుకున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇటీవలే ఓ ‘నమ్మకస్తుడైన నగల వ్యాపారికి’ విడతలవారీగా ‘నగదు-నగల’ రూపంలో సొమ్మును ఇచ్చినోళ్లందరికీ ‘ఐపీ నోటీసులు’ వస్తుండడంతో లబోదిబోమంటున్నారు.గతనెల మొదటి వారం నుంచే ‘జువెల్లరీ షో రూం’ మూసి ఉండడాన్ని గమనించినా.. ఏదో పనుండి తీయలేదేమోని.. అనుకున్నారు.కానీ..వారి ‘అనుమానాలు’
పటాపంచలు చేస్తూ సదరు’పెద్దమనిషి’ ..

‘మూటా-ముల్లె’ సదురుకుని ఉడాయించిన వైనం పట్టణంలో కలకలం సృష్టించింది. అరె..’నాంపల్లి.కిష్టయ్య’నా.? మంచోడే కదా.!? హా..ఔను..మంచోడే-ఇప్పుడు దాదాపు రూ.20.కోట్లకు మందిని ముంచి పత్తకులేకుండా పరారీలో ఉన్నాడు..అంటూ మెట్ పల్లి పట్టణంలో చర్చానీయాంశమైంది.

ఇరవై ఏళ్లుగా సుపరిచితుడుస్వతహాగా మంచి పనోడని పేరుతెచ్చుకున్న నాంపల్లి కిష్టయ్య ఇరవై ఏళ్ల నుంచి మెట్ పల్లి పట్టణ ప్రజలకే కాకుండా.. మల్లాపూర్, ఇబ్రహీంపట్నం,
మెట్ పల్లి మండలాల్లోని సుమారు ఓ 50-60 గ్రామాల్లో అతనికంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.దీంతో శుభకార్యాలయాలకు నగలు చేయించుకునేందుకు వచ్చేవారు.అలా పరిచయాలు పెంచుకుని మెయిన్ బజార్ లో ‘షోరూం’ పెట్టుకునేంతగా ఎదిగారు.

రూ.10.కోట్లు ఆభరణాలు చేయుమనిచ్చినవే

ఈ క్రమంలో అతనిపై ఉన్న నమ్మకంతో సరిగ్గా ‘పెళ్లిళ్ల సీజన్’కు కొద్దిరోజుల ముందే చుట్టుపక్కల గ్రామాల పరిచయస్తులు శుభకార్యాల కోసం రూ.10.కోట్లకు పైగా బంగారాన్ని ఇచ్చినట్టు బాధితులు లబోదిబోమంటున్నారు. ఇందులో కాయకష్టం చేసుకుని దాచుకున్న డబ్బులను ఆభరణాలు చేయించుకుందామని ఇచ్చినవి కాగా.. మిగిలిన సొమ్ము తమ ఇంటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం చేయుమని ఇచ్చినవని కళ్లనీళ్లపర్యంతమవుతున్నారు.

పెరుగుతున్న బంగారంపై పెట్టుబడి కోసం

మరి కొందరు ‘పెద్దమనుషులు’ ఇటీవల కాలంలో బంగారం కొనుగోలు కోసం ఇచ్చారంట. రోజురోజుకి ధరలు అంతకంతకూ పెరిగిపోతుండడంతో ‘ఆశపడ్డ’ పెద్దమనుషులు కిష్టయ్య చేతిలో సుమారు రూ.7-8 కోట్ల వరకు అప్పజెప్పి బంగారం కొనుమనిచ్చినవని చర్చించుకుంటున్నారు.ఇంకొందరు ఎలాగూ సీజన్ ఉంది కదాని బిజినెస్ కోసం మరో రూ.3.కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసినట్టు మాట్లాడుకుంటున్నారు.

ఓటేశాడు..టోపీ వేశాడు

అటు పెళ్లిళ్ల సీజన్ చివరి టైం.. ఇటు ఎన్నికల సీజన్ కూడా పీక్ టైం..ఎవరి హడావుడిలో వాళ్లున్న అదునుచూసుకుని.. షోరూంను మూసేసి..మూటా ముల్లె సర్దేసుకుని కుటుంబంతో సహా ఉడాయించిన వైనం ‘ఐపీ’ నోటీసులు చేతికొచ్చేదాక బయటకు పొక్కలేదంటే అతనిపై నమ్మకమే కారణమంటున్నారు.ఎన్నికల్లో ఓటేసిండు..మా నమ్మకాలపై టోపేసిండని నోటీసులు అందుకున్న బాధితులు అగ్గిమీద గుగ్గిలమే అవుతున్నారు.

నిండా ముంచడానికి..కొడుకులే కారణమా.?

రెండు దశాబ్దాల కాలంగా తాను సృష్టించుకున్న మంచితనపు కోట సత్తెనాస్ కావడానికి నాంపల్లి.కిష్టయ్య సొంత కొడుకులిద్దరూ కారణమయ్యుంటారన్న ప్రచారం జరుగుతోంది.ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్న కిష్టయ్య పరపతి కొడుకులిద్దరూ అప్రయోజకులు కావడమేనంటున్నారు.విచ్చలవిడిగా తిరగడం.. విలాసాలకు అలవాటుపడి..తామ జల్సాలకు విపరీతంగా ఖర్చులు చేయడం వల్లే ఈ జనాలను ముంచే కాన్సెప్ట్ కు బీజం పడిందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.తమ షోరూంకు నగలు.. ఆభరణాలు చేయుమని.. పెరుగుతున్న బంగారంపై పెట్టుబడి పెట్టిన సొమ్మును సమూలంగా ముల్లె గట్టుకుని ఉడాయిద్దామని కొడుకుల పథకం ప్రకారం ఇదంతా జరిగి ఉంటుందని బాధితులు భావిస్తున్నారు.

డబ్బులు-బంగారం ఇచ్చినోళ్లతో ప్రాణహాని

పెళ్లిళ్లకు నగలు.. ఆభరణాలు చేయుమని.. బంగారం కొనుగోలు చేయుమని ఇన్వెస్ట్ చేసినవాళ్ల నుంచి తనకు ప్రాణహాని ఉందని అడ్వకేట్ ద్వారా వచ్చిన ‘ఐపీ-నోటీసుల’ల్లో పేర్కొన్నారు.అది చూసిన వాళ్లందరూ పది పదిహేను రోజుల నుంచి షోరూంకు వచ్చిచూసుకుంటూ పోయే వాళ్లందరూ తెలిసిన వాళ్లందరిని అడగడం మొదలుపెట్టారు.ఇంటోళ్లందరి ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానాలు బలపడ్డాయి.
విడతలవారీగా నోటీసులు రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.కలవరపడుతున్నవాళ్లందరూ వకీల్ల దగ్గరికి.. పోలీసు స్టేషన్ లలోకి లబోదిబోమంటూ వెళుతుండడం కలకలంరేపుతోంది.

మరో 8.మంది కూడా ‘ఐపీ-దారిలో’.!?

ఇదే తరహాలో పట్టణానికి చెందిన మరో 8.మంది వ్యాపారులు కూడా దివాళా తీసినట్టు సమాచారం.కరోనా కాలం నుంచి ‘అసెంబ్లీ – పార్లమెంటు’ ఎన్నికల దాకా తమ వ్యాపారాల్లో నిండా మునిగిపోయినట్టు తెలుస్తోంది.’కర్ణుడి చావుకి సవా లక్షా కారణాలన్నట్టు’.. ప్రధాన బజార్ లో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా పాత షాపుల స్థానంలో కొత్త షాపుల నిర్మాణం.. పెరిగిన కిరాయిలు..షోరూంల ఏర్పాట్లు..తలకు మించిన ‘మెయింటెనెన్సు’..వ్యాపార పోటీ.. రోజురోజుకి బంగారం ధరల పెరుగుదల..వెరసి మోయలేని అప్పుల భారం మీద పడినట్టు చర్చించుకుంటున్నారు.ఈ పెరిగిన అప్పుల భారాన్ని తగ్గించుకునేందుకుగాను..సైడ్ దందాగా ‘రియల్ ఎస్టేట్’ రంగంలోనూ చేతులు కాల్చుకుని మరింత అప్పులపాలైనట్టు తెలుస్తోంది.అప్పులు..వడ్డీలు..పిల్లల చదువులు..పెళ్లీలు..చిట్టీ లు.. పెరిగిన ధరలతో దుకాణాల్లో తగ్గిన గిరాకీ దివాళాకు కారణాలుగా భావిస్తున్నారు.అన్నింటికీ మూలం డబ్బే కారణం కావడంతో..వాటిని తీర్చే మార్గం ‘ఐపీ’ పెట్టేసి ‘హాపీ’గా ఉడాయిద్దామని కొందరు ‘అడ్వకేట్ల’చుట్టూ తిరుగుతున్నట్టు ముచ్చటించుకుంటున్నారు.ఈ దివాళా తీసిన 8.మంది సొమ్ము సుమారుగా రూ.80-90 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.ఇప్పటికే ఒకరు రూ.20.కోట్లతో ఉడాయించడంతో..అతని బాటలోనే వీరూ నడిస్తే మా బతుకులు ఆగమైతైని తెలుసుకున్న ‘బాధితులు’ కొందరు ‘ఐపీ-పెట్టాలనుకుంటున్న వ్యాపారుల’చుట్టూ మా సంగతేంటని ప్రదక్షిణలు మొదలు పెట్టినట్టు సమాచారం.

ఐపీ పెడితే..ఐపోయినట్టేం కాదు

ఎవరైనా ఐపీ పెడితే అంతా ఐపోయినట్టేం కాదు..ఎవరూ బెంబేలెత్తి పోవాల్సిన అవసరం అస్సలు లేదంటున్నారు న్యాయనిపుణులు.ఐపీ అంటే ‘ఇన్ సాల్వెన్నీ పిటిషన్’ అని అర్థం.ఇన్ సాల్వెన్సీ అంటే దివాళా తీయడం అన్నట్టు.అంటే .. వ్యక్తి గానీ.. కంపెనీ గానీ..తీవ్ర నష్టాల్లో కూరుకుపోయి దివాళా తీస్తే..తమకు అప్పులిచ్చిన వారికి.. పెట్టుబడులు పెట్టిన వారికి..వారి చిరునామాకు కోర్టు ద్వారా పంపే నోటీసులనే ‘ఐపీ నోటీసులు’ అంటారు.అలా వచ్చిన వెంటనే కంగారు పడకుండా తాము కూడా ఇంకో అడ్వకేటును సంప్రదించి తమకు నోటీసులు ఇచ్చిన వాళ్లు నిజంగా దివాళా తీశారా.? లేదా.? దివాళా తీసినట్టు డ్రామాలుడుతున్నారాన్న విషయాన్ని బాధితులు నిరూపిస్తే..ఐపీ నోటీసులను డిస్మిస్ చేసే అధికారం కోర్టుకు ఉంటుందంటున్నారు.ఒకవేళ నిజంగానే దివాళా తీస్తే..1920 లో రూపొందించిన ఈ బ్రిటిష్ కాలంనాటి చట్టం ప్రకారం దివాళా తీసిన వారు తాము ఏవిధంగా నష్టపోయామో..స్థిర, చరాస్తుల వివరాలు,తగు ఆధారాలతో సహా కోర్టులో నిరూపించుకోవాల్సి ఉంటుంది.
కాగా.. ఏదిఏమైనా జగిత్యాల జిల్లాలో జనాల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటూ ‘ఐపీ-నోటీసుల’ కవచాన్ని అడ్డంపెట్టుకుని ఉడాయిస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతున్నది చెప్పకతప్పదు.!!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News