నేటి సాక్షి ప్రతినిధి, చందుర్తి: ( సతీష్ )ప్రజల ఆస్తి, ప్రాణ రక్షణే ధ్యేయంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం అంకితభావంతో విధులు నిర్వర్తించాలని వేములవాడ ఏఎస్పీ రిత్విక్ సాయి అన్నారు. శుక్రవారం ఆయన చందుర్తి మండల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని క్రైమ్ రికార్డులు, సిబ్బంది హాజరు పట్టిక మరియు వివిధ రిజిస్టర్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. మండల భౌగోళిక విస్తీర్ణం, గ్రామాల వారీగా నమోదవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏ ఏ ప్రాంతాల్లో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయో గుర్తించి, అక్కడ గస్తీ పెంచాలని సూచించారు. నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలీసులు ప్రజలకు చేరువగా ఉండాలని, గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఆయన సూచించారు.ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తూ స్టేషన్‌కు వచ్చే ప్రతి బాధితుడితో మర్యాదగా ప్రవర్తించాలని కోరారు. అన్యాయానికి గురైన వారికి చట్టపరంగా సత్వర న్యాయం జరిగేలా చూడాలని, సమస్యల పరిష్కారంలో జాప్యం చేయరాదని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి సర్కిల్ ఇన్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు, సబ్ ఇన్ స్పెక్టర్ రమేష్ మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు..

