నేటి సాక్షి – ధర్మపురి*( రాధారపు నర్సయ్య )ఈ నెల 27.02.2026 నుండి 11.03.2026 వరకు 13 రోజుల పాటు నిర్వహించనున్న ధర్మపురిలోని ప్రతిష్ఠాత్మక క్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధులు, వికలాంగులు మరియు ట్రాన్స్‌జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌లతో కలిసి అధికారులతో సమీక్షించారు.*ముందస్తు ప్రణాళికతో..*భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని అంచనా వేసి ముందస్తు ప్రణాళికతో అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. గత అనుభవాలు, ప్రస్తుతం చేపట్టిన చర్యలపై శాఖల వారీగా అధికారులను అడిగి తెలుసుకున్నారు.*భక్తుల సౌకర్యాలే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత*మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దేవాలయాల అభివృద్ధికి విస్తృతంగా నిధులు మంజూరు చేస్తున్నారని పేర్కొన్నారు.భక్తులకు తాగునీరు, శుద్ధ ఆహారం, వైద్యసేవలు, పారిశుధ్యం సమృద్ధిగా ఉండాలని, తాత్కాలిక వైద్య శిబిరాలు, అంబులెన్స్ సదుపాయాలు 24 గంటలు అందుబాటులో ఉంచాలని సూచించారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.*భద్రతా చర్యలు తీసుకోవాలి*గోదావరి పుణ్యస్నానాల సమయంలో భద్రతా చర్యలు చేపట్టి లోతు ప్రదేశాలకు వెళ్లకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, 45 మంది గజ ఈతగాళ్లను మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంచాలని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.*రవాణా, విద్యుత్, భద్రతపై ప్రత్యేక దృష్టి*ఆర్టీసీ అధికారులు అదనంగా 15 బస్సు సర్వీసులను 24 గంటలు నడపాలని మంత్రి సూచించారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా పెద్ద జనరేటర్లు సిద్ధంగా ఉంచాలని, రాత్రి వేళల్లో తగినంత లైటింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేపట్టాలని, అగ్నిమాపక శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయం కీలకమని, ప్రతి అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తించాలని మంత్రి స్పష్టం చేశారు.*10-20% ఎక్కువ భక్తుల రాక – సమగ్ర ఏర్పాట్లు*జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం భక్తుల రాక 10 నుండి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. చలువ పందిర్లు, టెంట్లు, LED స్క్రీన్లు, ప్రత్యేక VIP క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు.120 మంది ప్రత్యేక మున్సిపల్ సిబ్బంది, 20 చలివేంద్రాలు, 4 తాగునీటి ట్యాంకర్లు, 2 మొబైల్ మరుగుదొడ్లు, చెత్త సేకరణ బృందాలు, శానిటేషన్ కోసం ట్రాక్టర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. 5 తాత్కాలిక వైద్య శిబిరాలు మూడు షిఫ్ట్లలో ఏర్పాటు చేసి 108 అంబులెన్స్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంచాలని తెలిపారు.*350 మంది పోలీసులతో బందోబస్తు*జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రధాన ఆలయం, గోదావరి తీరం, బస్టాండ్, జాతర మైదానం వద్ద 350 మంది పోలీసులతో 24 గంటల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. షీ టీమ్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్, ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి భక్తుల భద్రతకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ బ్రహ్మోత్సవాలు రాబోయే 2027 గోదావరి పుష్కరాల నిర్వహణకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు.*బ్రహ్మోత్సవాల గోడపత్రిక, ఆహ్వాన పత్రికను ఆవిష్కరణ*ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికను.. ఆహ్వాన పత్రికను మంత్రి లక్ష్మణ్ కుమార్ ఆవిష్కరించారు.ఆర్డీవో మధుసూదన్, ధర్మపురి మున్సిపల్ చైర్మన్ వి. నాగలక్ష్మి, దేవాలయ చైర్మన్ జె. రవీందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సి.హెచ్. లావణ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు.____

