Friday, February 27, 2026

*శ్రీ వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలకు వేళాయే** సర్వాంగ సుందరంగా ముస్తాబైన దేవాలయం*

నేటి సాక్షి, ఎండపల్లి:* మండల పరిధి గుల్లకోట గ్రామంలోని పురాతన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 28వ తేదీ నుండి మార్చి 5వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆహ్వాన పత్రిక ద్వారా వెల్లడించారు. ఉత్సవాల నేపథ్యంలో ఆలయానికి రంగులు వేసి, విద్యుద్దీపాలతో అలంకరించి, ప్రాంగణాన్ని శుభ్రపరచి ప్రత్యేక ఆకర్షణగా తీర్చిదిద్దారు. ఆలయం ప్రకాశవంతంగా మెరిసిపోతూ భక్తులను ఆహ్వానిస్తోంది. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు దేవస్థాన ప్రధాన అర్చకులు అరుట్ల రంగాచార్యులు తెలిపారు. కాగా ఈ నెల 28న స్వామివారి తిరుకళ్యాణం, మార్చి 1న దీపోత్సవం, 4న రథోత్సవం ఘనంగా జరుగనున్నాయి. అదే రోజున ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రధానం, భక్తులకు సాన భాగ్యలక్ష్మి–యాది రెడ్డి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టనున్నారు. చివరి రోజు 5న చక్రతీర్థం, అవభృతస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీరు, ప్రసాదం, పార్కింగ్ వంటి అన్ని సదుపాయాలు కల్పించినట్లు ఆలయ కమిటీ చైర్మన్ బిసగోని సత్యం గౌడ్ తెలిపారు. ఉత్సవాల విజయవంతానికి గ్రామ ప్రజలు, యువకులు సహకరించాలని గ్రామ పంచాయితీ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం, ఆలయ కమిటీ విజ్ఞప్తి చేసింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా గుల్లకోట గ్రామం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News