నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మాట్లాడిన మాజీ ప్రజాప్రతినిధిపై సర్పంచ్ భర్త దాడికి పాల్పడిన ఘటన కోరుట్ల మండలం మాదాపూర్‌లో ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామంలో మురికికాలువలు, అభివృద్ధి పనులపై చర్చ జరుగుతుండగానే ఈ దాడి జరిగినట్టు సమాచారం.—*గ్రామాభివృద్ధి చర్చే వివాదానికి దారి*కోరుట్ల మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన జంగ శ్రీహరి అనే మాజీ ఎంపీటీసీ గ్రామంలో మురికి కాలువలు తీయాలని, పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టాలని గ్రామపంచాయతీ సెక్రటరీ అపర్ణతో మాట్లాడుతున్న సమయంలో ఘటన చోటుచేసుకుంది. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన సర్పంచ్ భర్త దేవేందర్, వెనుకనుండి వచ్చి శ్రీహారిపై దౌర్జన్యంగా చేయిచేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. చెంపపై చేయి చేసుకోవడమే కాకుండా పిడిగుద్దులు గుద్దడంతో శ్రీహారికి గాయాలైనట్టు తెలుస్తోంది. గ్రామ అభివృద్ధి గురించి మాట్లాడితే దాడి చేస్తారా అని పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.*రోజూ వచ్చి అడుగుతున్నాడనే కోపం..?*ఈ ఘటనపై ప్రశ్నించగా, శ్రీహరి గ్రామానికి సంబంధించిన విషయాలు రోజూ వచ్చి అడుగుతున్నాడనే కారణంతోనే కొట్టానని దేవేందర్ చెప్పినట్టు సమాచారం. అయితే, గ్రామ సెక్రటరీ అపర్ణ మాత్రం తనకు ఈ గొడవతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. పంచాయతీ కార్యాలయంలో వాగ్వాదం జరుగుతుండటంతో బయటకు వెళ్లాలని మాత్రమే చెప్పానని తెలిపారు. ఈ ఘటన రాజకీయంగా పాత మనస్పర్థల నేపథ్యంలో జరిగి ఉండవచ్చనే చర్చ గ్రామంలో సాగుతోంది.*సర్పంచ్ అధికారాలు భర్త చేతిలోనేనా.?*మాదాపూర్ గ్రామ సర్పంచ్‌గా జంగ భూలక్ష్మి ఉన్నప్పటికీ, అధికారాలను ఆమె భర్త దేవేందర్ చెలాయిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధి స్థానంలో ఉన్న వ్యక్తి గ్రామ అభివృద్ధి అంశాలపై మాట్లాడితే దాడి చేయడం దురదృష్టకరమని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.!______

