నేటి సాక్షి గ్రామస్థాయిలో ప్రజల సంక్షేమం కోసం సర్పంచ్ లు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్ల లో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో సర్పంచ్ లకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, డివిజనల్ పంచాయతీ అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో సర్పంచుల విధులు, అధికారాలపై సర్పంచులకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధి శిక్షణా సంస్థ వారు రూపొందించిన కరదీపికలోని అన్ని అంశాలపై సుశిక్షితులైన మాస్టర్ ట్రైనర్లతో శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో త్రాగునీరు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి ఇంటికి త్రాగునీరు అందాలని, ప్రతిరోజు ఇంటింటి నుండి తడి, పొడి చెత్తలను వేరువేరుగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించాలని తెలిపారు. ఉపయోగకరమైన చెత్తను వేరు చేసి సెగ్రిగేషన్ షెడ్ల ద్వారా సేంద్రియ ఎరువుల తయారీకి వినియోగించాలని తెలిపారు. గ్రామాలలో వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ వ్యర్ధాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని తెలిపారు. గ్రామాలకు మంజూరైన నిధులను నిబంధనల ప్రకారం ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని తెలిపారు. గ్రామాలలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించేలా అవగాహన కల్పించాలని, తద్వారా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు అందిస్తున్న ఉచిత ఇసుకను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గ్రామాలలో అభివృద్ధి పనుల అమలులో ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. గ్రామస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా ఉన్నట్లయితే విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తూ అన్ని ప్రభుత్వ పాఠశాలలో పూర్తి సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని, జిల్లాలో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని, వేసవిలో నిర్వహించే సమ్మర్ క్యాంప్ లకు సైతం విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరవుతున్నారని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, అంగన్వాడి కేంద్రం పరిధిలోని పిల్లలు హాజరయ్యేలా పర్యవేక్షించాలని తెలిపారు. గ్రామాలలో ఇంటి పనులు ఎలాంటి బకాయి లేకుండా పూర్తిగా వసూలు చేయాలని, గ్రామాలకు మంజూరయ్యే నిధులను నిబంధనలకు లోబడి ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని తెలిపారు. వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని తెలిపారు. సర్పంచ్ లు శిక్షణలో నేర్చుకున్న అంశాలను ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వినియోగించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.





