నేటి సాక్షి గజ్వేల్…గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రాజకీయాలు మరోసారి రగిలాయి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీల మధ్య పరస్పర అవగాహనతో నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో, పార్టీ ఆదేశాలకు కట్టుబడి భారతీయ జనతా పార్టీ తరఫున మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు బీసీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన విషయాన్ని వక్రీకరిస్తూ నీలం మధు ముదిరాజ్ విష ప్రచారం చేస్తున్నాడని బీజేపీ ముదిరాజ్ నేతలు మండిపడ్డారు. ప్రజ్ఞాపూర్ లోని బిజెపి పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “ఎంపీ ఎన్నికల్లో ఓటమి అక్కసు, మున్సిపల్ చైర్మన్ పదవి దక్కలేదనే నిరాశ – ఇవే నీలం మధు చేస్తున్న ఆరోపణల అసలు కారణాలు” అని తీవ్రంగా విమర్శించారు. బీసీ ద్రోహి అంటూ రఘునందన్ రావుపై ముద్ర వేయడం రాజకీయ నీచత్వానికి పరాకాష్ట అని వ్యాఖ్యానించారు.పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో పదవులు, లాభాలు అనుభవించి, పరిస్థితులు మారుతాయని గ్రహించి టికెట్ రాకపోవడంతో బయటకు వచ్చి మరో పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి ఇప్పుడు బీసీ పరిరక్షకుడిగా మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.“ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇద్దరు బీసీ అభ్యర్థులు పోటీ చేసినప్పుడు నీకు బీసీలు గుర్తుకు రాలేదా? అప్పుడే ఏదో ఒక బీసీకి మద్దతు ఇచ్చి గెలిపించలేదేంటి? ఇప్పుడు ఓటు వేయలేదని ఎంపీని బీసీ ద్రోహిగా ముద్ర వేయడం నీ రాజకీయ ద్వంద్వ వైఖరి కాదా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు.టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా పార్టీలు మారకుండా ప్రజల్లోనే ఉండి, వరుస ఓటముల తర్వాత కూడా వెనక్కి తగ్గకుండా పోరాడి ఎమ్మెల్యేగా, ఆపై ఎంపీగా గెలిచిన నాయకుడు మాధవనేని రఘునందన్ రావు అని కొనియాడారు. అధికార పార్టీ వైపు పరుగులు తీయకుండా బీసీలకు, ముఖ్యంగా ముదిరాజ్‌లకు గౌరవ స్థానాలు కల్పించారని తెలిపారు.సిద్దిపేట జిల్లా అధ్యక్ష పదవి ముదిరాజ్ నాయకుడికి ఇవ్వడం, మండల స్థాయిలో పదవులు కేటాయించడం, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్‌లో ఆరుగురు ముదిరాజ్ అభ్యర్థులకు బీఫామ్ ఇవ్వడం – ఇవన్నీ ఎంపీ బీసీల పక్షపాతాన్ని నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు.“నువ్వేమీ ముదిరాజ్ సమాజానికి ఏకైక ప్రతినిధి కావు. నీ వెనక ఎవరు ఉన్నారో, ఎవరెవరి ప్రోత్సాహంతో ఈ కుల రాజకీయం చేస్తున్నావో ప్రజలకు తెలుసు” అంటూ నీలం మధుపై తీవ్ర ఆరోపణలు చేశారు.ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు, కుల రెచ్చగొట్టింపులు ఆపకపోతే ముదిరాజ్ సమాజం ఐక్యంగా బలమైన రాజకీయ సమాధానం ఇస్తుందని హెచ్చరించారు.ఈ సమావేశంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ముదిరాజ్ నాయకులునాగులు ముదిరాజ్ , మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రొట్టెల దాసు, కదుల్ల ఎల్లేశం, దేవేందర్, రొట్టెల కృష్ణ, మంగళపల్లి సత్యనారాయణ, తలారి రాజు కదుల వెంకటయ్య బీజేపీ స్థానిక ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.





