నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )2027 గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్ధుల, వికలాంగుల, ట్రాన్స్ జెండర్ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై జగిత్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబడింది.సమీక్ష సమావేశంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీ) బి. రాజా గౌడ్ తో పాటు వివిధ శాఖల అధికారులు, ఈవై (EY) కన్సల్టెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.*అప్పుడు కోటిన్నర మంది.. ఇప్పుడు నాలుగు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం*2015 గోదావరి పుష్కరాలకు జగిత్యాల జిల్లాలోని వివిధ పుష్కర ఘాట్ల వద్ద 1 కోటి 50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేశారని అధికారులు వివరించారు. ఈసారి 2027 గోదావరి పుష్కరాలకు సుమారు 4 కోట్ల మంది భక్తులు రానున్నారని అంచనా వేశారు. ఇందుకు సంబంధించి చేపడుతున్న అభివృద్ధి పనులను అధికారులు మంత్రికి వివరించారు. అధికారులు తయారు చేసిన పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని మంత్రి సూచించారు.*రూ.940 కోట్ల నిధుల కేటాయింపు*ఈ సందర్భంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..గోదావరి పుష్కరాలకు బాసరా నుంచి భద్రాచలం వరకు నిధులు కేటాయిస్తానని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో చేపట్టే అభివృద్ధి పనులకు రూ. 940 కోట్లతో అంచనాలు తయారు చేశారని తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రానున్నందున పారిశుద్ధ్య పనులు, పార్కింగ్ సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ప్రభుత్వం తరపున అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మంత్రి అన్నారు. పుష్కరాల సందర్భంగా వీఐపీ భక్తుల లాగా సామాన్య భక్తులకు కూడా సమాన సౌకర్యాలు కల్పించాలని స్పష్టం చేశారు. గోదావరి నది తీరం వెంట ఉన్న ఆలయాలను ఆగమ శాస్త్రం ప్రకారం అభివృద్ధి చేయాలని సూచించారు. గత పుష్కరాల కంటే భిన్నంగా అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు.*నిధుల కోసం ముఖ్యమంత్రిని కలుస్తా..*పార్కింగ్‌కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలని, కనురెప్ప పాటు కరెంట్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. గోదావరి పుష్కరాలకు నిధుల కేటాయింపు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని స్వయంగా కలుస్తానని తెలిపారు. మరో 10 రోజుల్లో పుష్కరాలపై మరోసారి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు.పుష్కరాల సమీక్ష సమావేశానికి హాజరు కాని పలువురు అధికారుల తీరుపై మంత్రి అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ..జిల్లాలో గోదావరి నది కోరుట్ల నియోజకవర్గం నుండే ప్రవేశిస్తుందని తెలిపారు. జిల్లా తో పాటు పక్క జిల్లాల భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున తగిన సంఖ్యలో పుష్కర ఘాట్లు నిర్మించాలని సూచించారు. ఆలయాల వద్ద మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని కోరారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూగోదావరి నదికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహా పుష్కరాలు జరుగుతాయని తెలిపారు. 2027 గోదావరి పుష్కరాలకు సంబంధించి జిల్లాలో భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు అవసరమైన ఘాట్ నిర్మాణం, రోడ్డు విస్తరణ, లైటింగ్, ఇతర మౌలిక సదుపాయాలు, ఆలయాల అభివృద్ధికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలో సమర్పిస్తామని పేర్కొన్నారు.*భక్తుల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు*ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ..2027 గోదావరి పుష్కరాలకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. జిల్లాలో ప్రవహిస్తున్న గోదావరి నది తీరం వెంట ఉన్న ఘాట్లు, ఆలయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి తగిన బందోబస్త్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పార్కింగ్ స్థలాల వద్ద పూర్తి స్థాయిలో పోలీసు సిబ్బందిని నియమించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో పంచాయితీ రాజ్ శాఖ, ఆర్ అండ్ బి శాఖ, విద్యుత్ శాఖ, ఇరిగేషన్ శాఖ, మిషన్ భగీరథ, మున్సిపల్ కమిషనర్, ఆలయాల ఈవోలు, తహసీల్దార్ లు, ఎంపిడివోలు, పోలీసు శాఖ అధికారులు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు._____________





