నేటి సాక్షి, నారాయణపేట జనవరి 7,( రిపోర్టర్ ఇమామ్ సాబ్ ), విద్యార్థులు చదువు, క్రీడలను సమాన ప్రాధాన్యత ఇచ్చి ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలని నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య సూచించారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సీఎం కప్ 2025- 26 క్రీడా పోటీల సందర్భంగా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బుధవారం ఉదయం సీఎం కప్ టార్చ్ ర్యాలీని స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ సదా శివ రెడ్డి తో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, చదువు కు కూడా చాలా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే క్రీడాకారుల ప్రతిభను వెలికితీసి వారిని అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేలా చేయడమే లక్ష్యంగా సీఎం కప్ క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని క్రీడల్లో రాణించి ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు. కాగా సీఎం కప్ టార్చ్ ర్యాలీ మినీ స్టేడియం నుంచి సత్య నారాయణ చౌరస్తా,పాత బస్టాండ్ సెంటర్ చౌక్ మీదుగా దామరగిద్ద కు చేరుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వెంకటేష్ శెట్టి, మార్కెట్ కమిటి డైరెక్టర్ శరణప్ప, ఎస్ ఐ వెంకటేశ్వర్లు, పీడీ గొడుగు నర్సిములు, వ్యాయామ ఉపాధ్యాయులు సాయి, అనంత సేన, బాల్ రాజ్, రమణ, రత్నయ్య, అక్తర్ పాషా, మైనార్టీ గురుకుల కళాశాల, బీసీ బాలికల జూనియర్ కళాశాల, స్థానిక క్రికెట్ అకాడమీ క్రికెటర్లు, సీనియర్ క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.

