నేటి సాక్షి – కథలాపూర్*( రాధారపు నర్సయ్య )జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం కథలాపూర్ గ్రామంలో కలికోట ‘సూరమ్మ ప్రాజెక్టు’ ఎడమ కాలువ నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు స్థానిక భూ నిర్వాసిత రైతులు తీవ్రంగా నిరాకరించారు. సోమవారం ఆర్డీఓ దివాకర్ గ్రామంలో రైతులతో నిర్వహించిన సమావేశంలో ఈ విషయం స్పష్టమైంది.*న్యాయం దక్కుతుందన్న నమ్మకం లేదు*’సూరమ్మ ప్రాజెక్టు’ నుంచి తమకు సాగునీరు దక్కుతుందనే నమ్మకం లేదని రైతులు స్పష్టంగా తేల్చి చెప్పారు.వర్షాధారితంగా..చెరువుల కింద భూగర్భ జలాల ఆధారంగా వేసుకున్న బోర్ల ద్వారా తాము ఏడాదికి రెండు పంటలు పండించుకుంటున్నామని రైతులు పేర్కొంటున్నారు. ఇలాంటి అన్నం పెడుతున్న విలువైన భూములను కోల్పోయినందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.10 లక్షల పరిహారం మాకేమవసరమని రైతులు తిరస్కరించారు. కాలువ నిర్మాణం వల్ల తమకు ఎలాంటి లాభం లేదని, బదులుగా భూములు కోల్పోయి నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో రైతులు తమ ఆందోళనలను ఆర్డీఓ ముందు బలంగా వినిపించారు. ప్రాజెక్టు పూర్తయినా నీరు అందుతుందనే హామీ లేకుండా భూములు ఇవ్వడం సాధ్యం కాదని రైతులు ఖరాఖండిగా చెప్పారు.*వీలైతే రివర్స్ పంపింగ్ ద్వారా సాగునీరు అందించండి*’సూరమ్మ ప్రాజెక్టు’ ద్వారా తాము విలువైన భూములను కోల్పోతున్నామని..మేం ఇవ్వకపోతే పోలీసులచే..’భూ సేకరణ చట్టం’ ద్వారా జెసిబీలు పెట్టి మరీ లాక్కుంటరని తమకు తెలుసని వారు ఆవేదన వ్యక్తంచేశారు.కానీ..ఈ విలువైన భూములను కోల్పోయేకంటే..దుంపేట వద్ద ఒక సబ్ స్టేషన్ ఏర్పాటు చేసి..పైపులైన్ నిర్మాణం చేపట్టి దుంపేట, చింతకుంట,పోసానిపేట,ఇప్పపల్లి,పోతారం,కలికోట గ్రామాల్లోని చెరువులను వరద కాలువ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నింపవచ్చని రైతులు సూచిస్తున్నారు.ఇలా చేస్తే ఎకరానికి రూ.40-50 లక్షల విలువైన భూముల నుంచి గుంట భూమి కూడా వృధాగా పోదని వారు పేర్కొన్నారు.దీనిద్వారా భూగర్భ జలాలు వృద్ది చెంది ఈ ప్రాంతమంతా మరింత సస్యశ్యామలంగా తయారయ్యే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.ఇంతమంచి భూములను తాము ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమని స్పష్టం చేశారు.*కలికోట సూరమ్మ ప్రాజెక్టు – రైతుల అనుమానాలు, రాజకీయ వివాదాలు*కలికోట సూరమ్మ ప్రాజెక్టు (కలిగోట సూరమ్మ చెరువు ప్రాజెక్టు) జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో రైతులకు సాగునీటి ఆశలను రేకెత్తించినప్పటికీ, దశాబ్దాలుగా నిలిచిపోయి రాజకీయ వివాదాలకు కేంద్రబిందువైంది. తాజాగా ఎడమ కాలువ నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు కథలాపూర్ రైతులు నిరాకరించడం ఈ ప్రాజెక్టు చుట్టూ ఉన్న సమస్యలను మరోసారి బయటపెట్టింది. ప్రాజెక్టు చరిత్రలోకి వెళ్తే, 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు దశలతో పాటు కలికోట సూరమ్మ ప్రాజెక్టును మంజూరు చేశారు. అయితే 2014లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్) అధికారంలోకి వచ్చిన తర్వాత పనులు ఆగిపోయాయి. 2018లో ఎన్నికల నేపథ్యంలో మంత్రి హరీష్ రావు మళ్లీ శంకుస్థాపన చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. 2023లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాజెక్టును సందర్శించి, అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.*సిఎం హామీలు – నీటి మూటలు*ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, పనులు ముందుకు సాగకపోవడం, భూసేకరణలో జాప్యం రైతుల్లో అనుమానాలు పెంచాయి. రైతులు చెబుతున్న ముఖ్య వాదన – ప్రాజెక్టు పూర్తయినా తమ గ్రామాలకు నీరు అందుతుందనే గ్యారంటీ లేదు. ఇప్పటికే ప్రాంతంలో వరద కాలువలు, చెరువులు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి. రూ.10 లక్షల పరిహారం కూడా సరిపోదని, భూమి కోల్పోతే జీవనోపాధి పోతుందని వారి ఆందోళన.తెలంగాణలోని ఇతర ప్రాజెక్టుల్లో (కాళేశ్వరం వంటివి) భూసేకరణ, పరిహారం, నీటి పంపిణీ సమస్యలు సాధారణం. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా కాలువల నిర్మాణం, భూనిర్వాసితుల సమస్యలు తలెత్తాయి. కలికోట సూరమ్మ ప్రాజెక్టు కూడా ఇలాంటి రాజకీయ, పరిపాలనా జాప్యాలకు బలైపోతోంది.*ఇతర ప్రాజెక్టులకు రూ.20 లక్షలు ఎలా ఇవ్వడం సాధ్యమైంది.?*ప్రభుత్వం రైతులకు నీటి హామీ, మెరుగైన పరిహారం.. (ఇతర ప్రాజెక్టుల్లో రూ.20 లక్షల వరకు ఇస్తున్న నేపథ్యంలో..) ఎకరానికి రూ.25 లక్షలు ఇస్తేనే మేం మా విలువైన భూములను ఇస్తామని..అప్పుడే సమస్య పరిష్కారమవుతుందని ఖరాఖండిగా చెప్పేశారు. మేం రోడ్డున పడతామని..ఆ రోడ్డున పడకముందే తామే భూ నిర్వాసితులమంతా సామూహికంగా రోడ్డెక్కి నిరసనబాట పడతామని రైతులు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోకపోతే సమస్య మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంది. రైతుల ఆశలు నెరవేరేందుకు ‘భూనిర్వాసితుల’ సమస్యను తీర్చి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడమే మార్గమని ‘కలికోట-సూరమ్మ ప్రాజెక్టు’ ప్రాంత రైతులు అభిప్రాయపడుతున్నారు._______





