Monday, March 16, 2026

*సేవే జీవితం… విద్యే ఆయుధం**సమాజాన్ని మలిచిన మహనీయుడు కాసుగంటి సుధాకర్ రావు*—————————————-

నేటి సాక్షి – జగిత్యాల టౌన్(పూరెళ్ల బాపు),……………………………………..విద్య, పరిశ్రమ, సేవ… ఈ మూడు రంగాలను ఒకే జీవన లక్ష్యంగా మలిచుకున్న అరుదైన వ్యక్తిత్వం కాసుగంటి సుధాకర్ రావు. ఆయన జీవితం మాటల్లో చెప్పలేనంత విస్తృతం, కార్యాల్లో కొలవలేనంత లోతైనది. విద్య, సేవ, సమాజ నిర్మాణానికి అంకితమైన జీవితం గడిపిన కాసుగంటి సుధాకర్ రావు శుక్రవారం ఉదయం కన్నుమూయడంతో జగిత్యాల జిల్లా శోకసంద్రంలో మునిగింది. సాధారణ కుటుంబంలో జన్మించిన సుధాకర్ రావు చిన్ననాటి నుంచే చదువుపై అపారమైన మక్కువ కలిగి ఉండేవారు. విద్యే నిజమైన సంపద.. అనే నమ్మకంతో ముందుకెళ్లిన ఆయన, తన వ్యక్తిగత అభివృద్ధితోనే తృప్తి పడలేదు. తన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా అభివృద్ధి దిశగా నడిపించాలన్న తపన ఆయనను జీవితాంతం నడిపించింది.*విద్యతో వెలుగులు నింపిన మహనీయుడు*గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలనే లక్ష్యంతో శ్రీ సరస్వతి శిశు మందిర్, శ్రీ వాణి సహకార జూనియర్ కళాశాలలను స్థాపించి వందలాది మందికి విద్యా మార్గం చూపారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మానేయాల్సిన విద్యార్థులకు ఉచిత విద్య, సహాయం అందించి వారి భవిష్యత్తుకు బాటలు వేశారు. అనేక మంది విద్యార్థులకు ఆయన కేవలం ఉపాధ్యాయుడు కాదు,ఒక మార్గదర్శి, ఒక తండ్రి.*పరిశ్రమల ద్వారా ఉపాధి*విద్యతో పాటు ఉపాధి అవసరమని గ్రహించిన ఆయన గోదావరి వ్యాలీ ఇండస్ట్రీస్ను స్థాపించి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆధునిక వ్యవసాయ పరికరాల తయారీ ద్వారా రైతులకు తోడుగా నిలిచారు. వ్యవసాయం అంటే కేవలం కష్టం కాదు, శాస్త్రీయంగా చేస్తే లాభసాటిగా మారుతుందని ఆయన చూపించారు. అందుకే రైతులు ఆయనను “మనిషి కాదు… మన బంధువు”గా భావించేవారు. సేవా భావానికి ప్రతిరూపంసామాజిక సేవలో ముందుండే సుధాకర్ రావు జగిత్యాలలో రోటరీ క్లబ్ ను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైద్య శిబిరాలు, విద్యా సహాయం, పేదల పెళ్లిళ్లకు తోడ్పాటు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సహకారం… ఆయన సేవా పరిధి చెప్పాలంటే ఒక జీవితమే సరిపోదు.*ఆదర్శంగా నిలిచిన జీవితం*పదవులు, పేర్లు, సంపదకన్నా – మనిషిగా మిగిలిపోయే మంచితనమే ముఖ్యమని తన జీవితంతో నిరూపించారు. నిశ్శబ్దంగా సేవ చేయడం, ప్రతిఫలం ఆశించకపోవడం ఆయనకు అలవాటు. అందుకే ఆయన వెళ్లిపోయినా… ఆయన చేసిన మంచితనం మాత్రం ఇంకా ప్రజల మధ్య జీవిస్తూనే ఉంటుంది. కాసుగంటి సుధాకర్ రావు మృతి పట్ల జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, రోటరీ క్లబ్ సభ్యులు, విద్యా సంస్థల నిర్వాహకులు, పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ… “సమాజానికి వెలుగు చూపిన దీపం ఆరిపోయింది” అంటూ సంతాపం తెలిపారు. సుధాకర్ రావు గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా,ఆయన స్ఫూర్తి – విద్యలో, సేవలో, విలువల్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది.అది ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News