నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, డిసెంబర్ 15: ది అపోలో యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో సోమవారం “సైబర్ సెక్యూరిటీ & ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్” అనే హాట్ టాపిక్‌పై గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసి) డిప్యూటీ డైరెక్టర్ జనరల్, అదనపు రాష్ట్ర ఇన్ఫర్మాటిక్స్ అధికారి ఎస్. మధుసూధనరావు రిసోర్స్ పర్సన్‌గా పాల్గొని, సైబర్ సెక్యూరిటీ ప్రాధాన్యత, ఏఐ ఆధారిత టెక్నాలజీల వినియోగం, సైబర్ నేరాల స్వరూపంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్ మాట్లాడుతూ, నేటి ప్రపంచంలో టెక్నాలజీ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిందన్నారు. అయితే అదే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్లైన్ స్కామ్స్ రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయని, ప్రతిరోజూ వందలు, వేల సంఖ్యలో అమాయకులు మోసపోతున్నారని తెలిపారు. ముఖ్యంగా టెక్నాలజీపై అవగాహన లేని వారిని లక్ష్యంగా చేసుకుని మోసాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో సైబర్ నేరాల ప్రభావం మరింత ఎక్కువగా ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు బలమైన అవగాహన వ్యవస్థ అవసరమని స్పష్టం చేశారు. విద్యాసంస్థలు ఈ విషయంలో కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, విద్యార్థులు సైబర్ భద్రతపై పూర్తి అవగాహన కలిగి సమాజానికి కూడా చైతన్యం కల్పించాలన్నారు.రిసోర్స్ పర్సన్ ఎస్.మధుసూధనరావు మాట్లాడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైబర్ సెక్యూరిటీలో ఎలా ఉపయోగపడుతోందో, హ్యాకింగ్, ఫిషింగ్, ఆన్లైన్ మోసాలు, డేటా దొంగతనం వంటి నేరాలను ఏఐ సహాయంతో ఎలా గుర్తించి నివారించవచ్చో వివరించారు. ప్రభుత్వ విభాగాల్లో అమలవుతున్న సైబర్ భద్రతా వ్యవస్థలు, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా స్పష్టమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొ. ఎం. పోతరాజు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొ. డి. జగదీశన్, అధ్యాపకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అపోలోను సందర్శించిన అమెరికన్ సిటిజన్ సర్వీసెస్ ప్రతినిధులుఅమెరికన్ సిటిజన్ సర్వీసెస్(ఎసిఎస్) ప్రతినిధులు సోమవారం ది అపోలో యూనిర్శిటీని సందర్శించారు. అపోలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ హెచ్. వినోద్ భట్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. పోతరాజు, యూనిట్ హెడ్ ఎస్. బాలరాజ్ తదితర అధికారులతో వీరు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో విద్య, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ సేవల వినియోగం, అంతర్జాతీయ ప్రయాణాల్లో భద్రత వంటి అంశాలపై చర్చించారు. భారత్‌లో యునైటెడ్ స్టేట్స్ పౌరుల హక్కులు, బాధ్యతలు, అందుబాటులో ఉన్న ప్రభుత్వ సేవలను వివరించారు. అమెరికా పౌరుల సేవల కోసం యుఎస్ కాన్సులేట్ జనరల్, హైదరాబాద్‌లో అందుబాటులో ఉందని ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లేదా ఒడిశా రాష్ట్రాల్లో ఉన్న అమెరికా పౌరులకు అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు వెంటనే తమను సంప్రదించాలని సూచించారు.





