నేటి సాక్షి, మునగాల( పాముల రాఘవేందర్) సూర్యపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో వెలసిన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో జరుగుతున్న పావనమైన జాతర మహోత్సవాలు గత పది రోజులుగా అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మికోత్సాహంతో కొనసాగుతున్నాయి. ఈ మహోత్సవాల చివరి దినమైన శుక్రవారం వసంతోత్సవ మహోత్సవం ( గాందోలి) సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తజన సందోహంతో నిండిపోయి, భక్తి పరవశ వాతావరణం అలుముకుంది.ఈ పవిత్ర సందర్భంలో కోదాడ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్వామివారి దివ్య సన్నిధికి విచ్చేసి, పరమ భక్తి భావంతో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. స్వామివారి పాదసేవను ఆచరించి దివ్య అనుగ్రహం, కృపాకటాక్షాలు పొందారు.అనంతరం బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మల్లయ్య యాదవ్ కి గజమాలతో ఘన స్వాగతం పలికి సత్కరించారు. మహిళలు తిలకం దిద్ది స్వాగతం పలికారు. మల్లన్న అభిమానులు, యువకులు మల్లన్న, మల్లన్న అంటూ జాతరలో వసంతోత్సవం సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బొల్లం మల్లయ్య యాదవ్ చేతుల మీదుగా పుణ్యప్రదమైన మహా అన్నదాన సేవా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. స్వామివారి ప్రసాదంగా భావించి భక్తజనులకు భక్తి భావంతో అన్నసంతర్పణ నిర్వహించారు.ఈ సందర్భంగా మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.రేపాల గ్రామంలో వెలసిన స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మహిమ అపారమైందని, ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించిన ప్రతి భక్తులపై స్వామివారి దివ్య అనుగ్రహం, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. భక్తులందరికీ స్వామివారి శాంతి, సౌభాగ్యం, క్షేమం కలగాలని ఆకాంక్షించారు.ఈ మహోత్సవ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దివ్య దర్శనం చేసుకొని భక్తుల కుటుంబాల సౌఖ్యం, సమృద్ధి, ఐశ్వర్యం కోసం పూజలు నిర్వహించామని తెలిపారు. .స్వామివారి దివ్య కృపాకటాక్షాలు సమస్త భక్తజనులపై నిత్యం ప్రసన్నంగా ఉండాలని మనసారా ప్రార్థించారు. ఆలయం అంతా భక్తులతో జై లక్ష్మీనరసింహస్వామి జై అంటూ నినాదించారు. ఈ కార్యక్రమంలో రేపాల సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ, పల్లి ఆదిరెడ్డి,సారిక పెద్ద రామయ్య, గుండు దేవదాసు, గండు హనుమంతు,పోనుగోటి రంగా, మొగిలిచర్ల రమేష్, తదితరులు పాల్గొన్నారు.





