అనుమానాస్పదంగా..
- ‘టీవీ యాంకర్’..’హత్యా..ఆత్మహత్యా’.!?
- సహజీవన సహచరుడి ‘అదృశ్యం’.?
* నివ్వెరపోయిన ‘తెలుగు మీడియా’
నేటి సాక్షి – తెలంగాణ బ్యూరో
( రాధారపు నర్సయ్య )
“తెలంగాణ మీద అంత పాయిరం ఉన్న ‘స్వేచ్ఛ’ తన ‘బతుకు’ మీద లేక అర్థాంతరంగా తన ‘గొంతు’ను శాశ్వతంగా పూడ్చేసి వెళ్లి’పోయింది.. సమాజానికి ‘అనుమానాస్పదంగా..”
‘స్వేచ్ఛ’ లేకుండా వెళ్ళి’పోయింది.!
ప్రముఖ టీవీ చానల్‌లో న్యూస్ యాంకర్‌గా పని చేస్తున్న స్వేచ్ఛ వొటార్కర్ (40) మృతి చెందారు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు జవహర్‌నగర్‌లోని షాలం లతా నిలయంలోని పెంట్‌హౌ్‌సలో నివాసముంటున్న స్వేచ్ఛ చనిపోయారంటూ పోలీసులకు శుక్రవారం రాత్రి 9.20 గంటల సమయంలో సమాచారం అందింది. ఈ మేరకు అక్కడికి వెళ్లి చూడగా.. స్వేచ్ఛ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారని పోలీసులు తెలిపారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఆమె చనిపోయి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేశారు.ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. గతంలో తన తల్లిదండ్రులు శ్రీదేవి, శంకర్‌తో కలిసి పార్సిగుట్టలోని వైఎస్ఆర్ పార్కు సమీపంలో నివాసమున్న స్వేచ్ఛ.. గత నాలుగేళ్లుగా కూతురు(14)తో కలిసి వేరుగా ఉంటున్నారు. జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. స్వేచ్ఛ మృతిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్ రాజునాయక్ తెలిపారు.
‘అనుమానాస్పదంగా..?
ఏంటి స్వేచ్ఛ ఇలా చేసావ్.? ఇలా చేయకుండా ఉండాల్సింది.!
తొందరపడ్డావ్.? అని..
ఈ సోది ముచ్చట్లు ఆపి
సమాజం, సమాజం నుండి వచ్చే సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలి అవగాహన కలిగిన అమ్మాయి, స్వేచ్ఛగా జర్నలిజంలో ఉన్న స్వేచ్ఛ చనిపోయిన తీరు,దాని వెనుకాల ఉన్న నిజాలు… ప్రశ్నించకుండా ఆమె ఆత్మహత్య చేసుకుంది అని జరుగుతున్న ‘సానుభూతి ప్రచారం విచారకరం’.!అసలు అది ఆత్మహత్యా.? హత్యా.? అని తేల్చాల్సిన సమయమిది.
‘మోకాళ్ళ వరకు కూర్చుని ఉండే స్థితిలో ఉరి పడిన విధానం..
ముక్కు నుండి రక్తం కారిన తీరు..
ఉరి వేసుకున్నప్పుడు సహజంగా బయటకు రావాల్సిన నాలుక.. కనపడకపోవడం..
మరణించడానికి బలమైన కారణాలు ఏంది.? అనేది విచారణకు డిమాండ్ చేయాల్సింది పోయి.. నాలుగు సానుభూతి ముచ్చట్లు పెట్టడం ‘జర్నలిస్టు’లపై జనాలకెంత సామాజిక బాధ్యత ఉందో అర్థమవుతోంది.!
సహజీవన సహచరుడే..
‘టీ-న్యూస్ యాంకర్’.. స్పెషల్ కరస్పాండెంట్ స్వేచ్ఛ(40) బలవంతంగా ఎందుకు ప్రాణం తీసుకుంది.? వైవాహిక జీవితంలో పోరాటం చేస్తూనే వెళ్ళిపోయింది.! గాంధీనగర్ పక్కనే జవహర్ నగర్ లో పెంట్ హౌస్ లో ఉంటున్న స్వేచ్ఛ ఇంట్లో చున్నీతో నిజంగానే ఉరి వేసుకుని కనుమూసిందా.? పోలీసులకు సమాచారం తెలిసి వెంటనే ఆమె భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె తలిదండ్రులు శ్రీదేవి, తెలంగాణ శంకర్ దగ్గరలో రామ్ నగర్ లో నివాసం వుంటున్నారు. 13 ఏళ్ల సంధ్య కమల్ అనే కుమార్తె వుంది.మొదటి వివాహం విడాకులకు దారి తీసింది.! ఆ తర్వాత ‘పూర్ణ చందర్ రావు’ అనే మీడియా సహచరుడితో సహ జీవనం చేస్తూ ఉండేది.అతనితో కూడా కొద్దికాలంగా విభేదాలతో ఘర్షణ పడుతూ ఉన్నట్టు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.స్వేచ్ఛ స్వతహాగా
ధైర్యవంతురాలు. పోరాటం చేస్తూనే వుంది.మంచి కవయిత్రి కూడా.ఆమె రచించిన ‘మట్టిపూల గాలి’ కవితా సంపుటిని రెండేళ్ల క్రితం విడుదల చేసింది. ప్రకృతిని ఎంతో ఇష్టపడే స్వేచ్ఛ అన్యాయాన్ని అంతే సూటిగా ప్రశ్నించేది. తెలంగాణ ఉద్యమంలో మహిళా పాత్రికేయురాలిగా తన వంతు కీలక పాత్ర పోషించింది.! తను పని చేస్తున్న ఛానెల్ ను ప్రభుత్వం అన్యాయంగా మూసేయించినప్పుడు ఢిల్లీ వెళ్లి పోరుబాట చేసింది స్వేచ్ఛ.!
జర్నలిజం అంటే స్వేచ్ఛకు ఎంతో ఇష్టం. తొలుత ‘మహా న్యూస్’ లో చేరింది. ఆ తరువాత ‘హెచ్ఎం.టీవీ’.. అక్కడ నుంచి 12 ఏళ్లు ‘టీవీ-9’ లో చేసి మంచి యాంకర్ గా, హోస్ట్ గా, ఇంటర్వ్యూయర్ గా, న్యూస్ ప్రజెంటర్ గా గుర్తింపు పొందింది. కొన్నాళ్ళు మళ్ళీ ‘వి-6’..లో చేసి గత మూడేళ్లుగా ‘టీ-న్యూస్’ లో చేస్తోంది.! ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఎడిట్ పేజీ లో వ్యాసాలు రాస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వుంది.! ఇటీవలే జరిగిన జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హొసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా కూడా గెలిచింది.మరి అంత కష్టం ఏమొచ్చిందో ఏమో మంచం బెడ్ ఫై నుంచి నిలబడి ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయి కనిపించింది.ఒక మంచి ఉద్యమ జర్నలిస్ట్ ను, మంచి రచయిత్రిని చిన్న వయసులోనే కోల్పోయామని ఆమె సన్నిహితులు సహొరులు..అశ్రు నివాళులు అర్పించారు.
‘స్వేచ్ఛ’ తండ్రి శంకర్ సంచల ఆరోపణలు..
‘టీవీ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్యకి ఇదే అసలు కారణం..’ అంటూ..ఆమె తండ్రి శంకర్ సంచలన ఆరోపణలు చేశారు.
టీవీ యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ వార్త తెలుగు మీడియా ప్రపంచాన్ని షేక్ చేసింది. ఎంతో ధైర్యవంతురాలైన స్వేచ్ఛ ఇలాంటి పని ఎందుకు చేస్తుంది.? అంటూ అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రచయిత్రి, ధైర్యశాలి, గొప్ప వక్త అయిన స్వేచ్ఛ ఇలా చివరకు వదిలేసి వెళ్లింది అంటూ ఆమె మిత్రులంతా కూడా సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. తోటి జర్నలిస్టులు, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్..మాజీ మంత్రి కేటీఆర్ వంటి వారు సైతం ఆమె మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.కాగా స్వేచ్ఛ ఆత్మహత్యకి కుటుంబకలహాలే కారణం అని తెలుస్తోంది. స్వేచ్ఛ తండ్రి తాజాగా తన కూతురి ఆత్మహత్య ఘటనపై స్పందించారు. తన కూతురు ఇలా చేసుకోవడానికి కారణం ‘పూర్ణ చంద్రరావు’ అనే వ్యక్తి కారణమని ఆరోపించారు. గత కొన్ని రోజులు వారిద్దరూ కలిసే ఉంటున్నారని తెలిపారు. ఇద్దరూ సహ జీవనం చేస్తున్నారని ఆయన అన్నారు. పెళ్లికి మాత్రం నిరాకరించాడని ..
ఆ విషయంలోనే తన కూతురు మనస్థాపం చెంది ఉంటుందని ఆయన అన్నారు.
‘ఆయనతో కలిసి ఉండలేను నాన్నా..’ అంటూ జూన్ 26న కూతురు చెప్పిందని స్వేచ్ఛ తండ్రి తెలిపారు. అతడ్ని కఠినంగా శిక్షించాలని స్వేచ్ఛ తండ్రి కన్నీటిపర్యంతం అయ్యారు. కాగా యాంకర్ స్వేచ్ఛకి పెళ్లై ఓ కూతురు కూడా ఉందని.. మొదటి భర్తతో విడిపోయిన తరువాత.. కూతురుతో పాటు ఉంటున్న స్వేచ్ఛతో కొన్నాళ్లుగా ఆ పూర్ణ చంద్రరావు అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్టు కన్నీటి మధ్య తెలిపారు.
అయితే పూర్ణ చంద్రరావుని పెళ్లి చేసుకోమని యాంకర్ స్వేచ్ఛ ఒత్తిడిచేయడంతో.. అతను పెళ్లికి నిరాకరించడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని.. పెళ్లి విషయంలోనే యాంకర్ స్వేచ్ఛ చాలాసార్లు పూర్ణ చంద్రరావుతో గొడవలు పడేదని.. ఈ కారణమే ఆమె ఆత్మహత్యకి కారణం అని ఆమె తండ్రి ఆరోపణలు బట్టి తెలుస్తోంది.
నివాళులు కాదు నిగ్గు తేల్చాలి..
‘స్వేచ్ఛ’ కోసం ఉమ్మడి కార్యాచరణ తీసుకోవాలని సర్వత్రా వినిపిస్తోంది.’స్వేచ్ఛ అంత్యక్రియలు’ ముగిసేలోగా అతడిని అరెస్ట్ చేయాలనీ అందరం ముక్తకంఠంతో డిమాండ్ చేయాలంటున్నారు.
స్వేచ్ఛ పిరికిపంద కాదు, ఉద్యమ జర్నలిస్ట్. ప్రజా ఉద్యమాల్లో నిమగ్నమైన తల్లిదండ్రులు, విప్లవ నేపథ్యం నుంచి వచ్చి పాత్రికేయురాలిగా ఎదిగిన తెలంగాణ బిడ్డ. సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ నేత, కవయిత్రి. ప్రముఖ యాంకర్ కూడా.ఆమె మరణం సహజ మరణం కాదు. అది ఆత్మహత్య కూడా కాదు, అందుకు కుటుంబ కలహాల కారణం కాదు. అది ముమ్మాటికీ హత్య.
అని స్వేచ్ఛ తండ్రి శంకర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు, ఆమె హత్యకు కారణం పూర్ణచంద్ర రావు. అతడి ప్రోద్భలం లేదా ప్రత్యక్ష పాత్రపై విచారణ జరిపి అతడిని తక్షణం అరెస్ట్ చేసి శిక్షించాలి. స్వేచ్ఛ అంత్యక్రియలు ముగిసేలోగా అతడిని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
పెళ్ళయి పిల్లలు ఉన్నప్పటికీ స్వేచ్ఛను వివాహం చేసుకుంటానని నమ్మించి మూడేళ్ళుగా సాహచర్యం చేసి చివరకు మాట తప్పి మోసం చేయడంతో ఆమె చివరాఖరికి విడిగా ఉండటానికే నిర్ణయించుకుంది. తండ్రిని పిలిపించి ఆ సంగతి చెప్పింది కూడా. ఆ మరుసటి రోజు ఆమె ఉరి వేసుకుని చనిపోవడం అనుమానస్పదం. ముక్కులోంచి రక్తం కారడం, సీలింగ్ ఫ్యాన్ కుఉరి వేసుకుందని అంటున్నారు గానీ బెడ్ పై తన కాళ్ళు మడిచి ఉండటం, ఆమెను చంపి… ఉరివేసినట్లు కూడా అనిపిస్తోంది.తన భౌతిక కాయాన్ని బెడ్ షీట్ లో పడుకోబెట్టి ఆసుపత్రికి తరలిస్తుంటే తను పెంచుకున్న కుక్క పిల్ల ఒక్కటే అరుస్తోంది.స్వేచ్ఛ మరణం పట్ల పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.ఏది ఏమైనా, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆత్మహత్యగా తేల్చినా ఆమెను మానసికంగా శారీరకంగా వేధించి ఎటూ పాలుపోని స్థితికి తెచ్చి ఒకవేళ బలవన్మరణానికి కారణమైనప్పటికీ ఆ సదరు వ్యక్తి నిస్సందేహంగా శిక్షార్హుడు. హంతకుడే..అంటున్నారు.స్వేచ్ఛ కలిసి పనిచేసిన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ (టియూడబ్ల్యూజె) ఆమెది ‘అకాల మరణం’ అని పేర్కొంటూ ఘన నివాళే అర్పించింది. కానీ అది కాదు చేయవల్సింది..ఆమె మరణం అనుమానస్పదంగా ఉన్నందున తన ఉద్యమ సహచరులుగా పోలీసు విచారణకు డిమాండ్ చేస్తూ కార్యక్రమం తీసుకోవాల్సిన తరుణమిది అంటూ సహచర జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క టీయూడబ్ల్యూజె సంఘం మాత్రమే కాదు, ఇతర జర్నలిస్ట్ సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలతో సహా వ్యక్తులు, మిత్రులు, మొత్తం పౌర సమాజం స్వేచ్ఛ ‘అనుమానాస్పద’ హత్యోదంతం పట్ల ఉదాసీనత వదిలి తక్షణం కార్యక్రమం తీసుకుని పోలీసు విచారణకై డిమాండ్ చేయాలి, పూర్ణచంద్ర రావును ఆరెస్ట్ చేసేదాక వదలకూడదు. అందుకు అవసరమైన స్వతంత్ర నిజ నిర్ధారణ కోసం ముందుకు రావాలన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.పూర్ణచంద్ర రావు డబ్బు, పలుకుబడి, రాజకీయ అండ గల వ్యక్తే కాక అతడు ఒక బీఆర్ఎస్ ముఖ్య నేత వద్ద పనిచేస్తున్నందున పోలీసు విచారణ పక్కదోవ పట్టే అవకాశం ఎంతైనా ఉందంటున్నారు. ఈ దృష్ట్యా ఒక ఉమ్మడి కార్యాచరణకు అందరం ఇప్పుడే కూడబలుక్కోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అన్నట్టు, స్వేచ్చ ఇటీవల మరోసారి తన సహచరుడితో దిగిన ఫోటోను పబ్లిక్ గా షేర్ చేసుకుంది. తర్వాతే వారిద్దరి మధ్య గొడవలు పెరిగాయని తెలుస్తోంది.!
స్వేచ్ఛ కలం నుంచి జాలువారిన కవితలు..
నీ కౌగిలి
పట్టు విడిచిన మరుక్షణం
పోతుంది ప్రాణం
చుక్కల్లో చెల్లా చెదురై
మళ్ళీ నిన్ను చుట్టేయనా
చందమామ
—- ఇది స్వేచ్ఛ రాసిన కవిత!
వెన్నెలని కప్పుకున్న రాళ్ళు
చలిని ముద్దాడుతున్నాయి
వెన్నెల గీసిన సరిహద్దుల్లో
తమను తాము దాచుకున్నాయి
ఎటు నుంచి చూసినా
వెన్నెల లేనిదెక్కడ?
ప్రేమలేని
రాయి దేహమెక్కడ?
నేనొచ్చే దారి నిండా
వెన్నెల కుప్పలు పరచి చూడు
ఓ చందమామా…
కరిగిన వెన్నెలనై
భుజంఫై తల వాల్చి
చీకటికెప్పుడూ దొరకని
నిదురనై పోతాను
ఓ చందమామా…
- ఇది స్వేచ్ఛ కవిత