*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులకు గౌరవ ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జి శ్రీమతి రత్న పద్మావతి జీవిత ఖైదు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 4,500 జరిమానా విధిస్తూ కీలక తీర్పు వెలువరించారు ఈ కేసుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే అగ్గిమల్ల గ్రామానికి చెందిన లక్ష్మి తన కుమారుడు తరువేని వెంకటేష్ 26 సంవత్సరాలు హత్యకు గురైన విషయమై గొల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంకటేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ మల్కాపురం ప్రాంతంలో నివాసం ఉండేవాడు.తేది 18-10-2021న మధ్యాహ్నం సుమారు 3:00 గంటల సమయంలో వెంకటేష్ ఫోన్ మాట్లాడుకుంటూ ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అనంతరం కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయగా, గ్రామ శివారులోని పొలం సమీపంలో వెంకటేష్ గొంతు కోసి హత్య చేయబడిన స్థితిలో శవం కనిపించింది.పోలీసుల దర్యాప్తులో మృతుడు వెంకటేష్‌కు గ్రామానికి చెందిన కొలగాని రాజేందర్‌తో గతంలో వివాదం ఉన్నట్లు గుర్తించారు. ఆ ద్వేషంతోనే రాజేందర్ తన సహచరులు కస్తూరి మల్లేష్ మరియు అవుల కిరణ్ కుమార్‌లతో కలిసి వెంకటేష్‌ను హత్య చేసినట్లు నిర్ధారించారు.మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయగా ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ కోటేశ్వర్ కేసును సమగ్రంగా దర్యాప్తు చేసి నిందితులు కొలగాని రాజేందర్ 27 సంవత్సరాలు కస్తూరి మల్లేష్ 30 సంవత్సరాలు అవుల కిరణ్ కుమార్ 32 సంవత్సరాలు లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.ఈ కేసులో ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ మల్లికార్జున్ మరియు కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టి, కీలకమైన సాక్ష్యాధారాలను గౌరవ కోర్టుకు సమర్పించారు. వాటిని సమగ్రంగా పరిశీలించిన కోర్టు, ముగ్గురు నిందితులపై నేరం రుజువైనట్లు నిర్ధారించి జీవిత ఖైదు శిక్షతో పాటు ఒక్కొక్కరికి 4,500 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ మాట్లాడుతూ, సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకోలేరని, పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ సమన్వయంతో పటిష్టమైన దర్యాప్తు, న్యాయ నిరూపణ ద్వారా తప్పనిసరిగా నిందితులకు శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.





