నేటి సాక్షి మహబూబాబా ద్ (భూక్యా రవి నాయక్)గందరగోళ రిజర్వేషన్ విధానం… బీసీలకు తీవ్ర నష్టం: మేకల నాగన్న హైకోర్టు తలుపు తట్టిన కేసు కురవి మండలం రాజోలు గ్రామానికి చెందిన మేకల నాగన్న ఇటీవల విడుదలైన గ్రామ పంచాయతీ రిజర్వేషన్ జాబితా రాజ్యాంగ సూత్రాలైన సమన్యాయం, సామాజిక న్యాయం, సమతుల్య ప్రతినిధిత్వాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకోకుండా తండాలు, గ్రామాలను వేర్వేరు యూనిట్లుగా పరిగణించడం వల్ల ఎస్టీ రిజర్వేషన్ అవసరానికి మించి పెరుగుతోందని, 100% గిరిజన జనాభా ఉన్న తండాలను పూర్తిగా ఎస్టీ కేటగిరీకి కట్టిపడేయటం, అదే సమయంలో సాధారణ గ్రామాల్లో కూడా అదనపు ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వడం వల్ల బీసీ వర్గాలు రాజకీయంగా పూర్తిగా నష్టపోతున్నాయని ఆయన వాదిస్తున్నారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 243Dలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. మండలం యూనిట్‌గా తీసుకుంటేనే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, ఉదాహరణకు కురవి మండల జనాభాలో ఎస్టీలు 40% ఉంటే ఆ మేరకు వారి కోటా ఉండాల్సి ఉండగా, గ్రామాలు–తండాల ప్రాతిపదికగా కృత్రిమంగా అధిక రిజర్వేషన్ కేటాయించడం వల్ల ఇతర వర్గాలకు రావాల్సిన అవకాశాలు పూర్తిగా కోల్పోతున్నాయని ఆయన చెప్పారు. కలెక్టర్ విడుదల చేసిన జాబితాలో పారదర్శకత లేకపోవడం, రిజర్వేషన్ లెక్కల్లో నియమాలను పాటించకపోవడం, బీసీల జనాభా ఉన్నప్పటికీ వారికి తగిన స్థానాలు తగ్గిపోవడం ఈ వ్యవస్థ యొక్క పెద్ద లోపంగా ఆయన పిటిషన్లో వివరించారు. దీనివల్ల బీసీ వర్గాల రాజకీయ డిస్ప్లేస్మెంట్ పెరుగుతోందని, ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ అనే రాజ్యాంగ తత్వానికి ఇది పూర్తి విరుద్ధమని ఆరోపించారు. ఈ విధానంపై మహబూబాబాద్ జిల్లాలో బీసీ వర్గాల్లో తీవ్రమైన అసహనం నెలకొంది. ఇది ఒక్క మండలం సమస్య కాదు, రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో ఇదే సమస్య కొనసాగుతోందని నాగన్న తెలిపారు. హైకోర్టు ఈ కేసులో మండలం యూనిట్‌ను ప్రధాన ఆధారంగా తీసుకొని రిజర్వేషన్లను పునర్ పరిశీలించాల్సిందిగా ఆదేశిస్తే, రాబోయే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు.





