Thursday, January 22, 2026

శ్రీవారి భక్తులపై దూసుకెళ్లిన 108 అంబులెన్స్

  • తిరుమలకు పాదయాత్రగా వెళ్ళుతూ ఇద్దరు భక్తులు మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు

నేటి సాక్షి, ప్రతినిధి, చంద్రగిరి : ప్రమాదానికి గురైన వ్యక్తుల ప్రాణాలను కాపాడే 108 అంబులెన్స్ వాహనం పొగ మంచు కారణంగా తిరుమల శ్రీవారి దర్శనానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులపై దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరుభక్తులు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చంద్రగిరి పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి నుండి గుండె పోటుకు గురైన రోగిని ఎక్కించుకొని 108 వాహనం తిరుపతి రుయా ఆస్పత్రికి వస్తున్న సందర్భంలో సోమవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో చంద్రగిరి మండలం, ఏ రంగంపేట నర్సింగాపురం జాతీయ రహదారిపై అన్నమయ్య జిల్లా రామసముద్రం నుండి తిరుమలకు శ్రీవారి దర్శనానికి పాదయాత్రగా వస్తున్న శ్రీవారి భక్తులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం, చంపాలపల్లికి చెందిన పెద్ద రెడ్డమ్మ (40) శేగంవారిపల్లికి చెందిన లక్ష్మమ్మ(45) అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి కే. రెడ్డమ్మ, యశోద, తులసమ్మ, రమేష్ లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చంద్రగిరి పోలీసులకు ప్రమాద ఘటన విషయం తెలియజేయడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. పోలీసులు మృతులు, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో బంధువులు తిరుపతి రుయా ఆసుపత్రికి చేరుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వెళుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లారని బోరుమని విలపించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ దర్శనానికి కోసం వెళుతూ వైకుంఠ ప్రాప్తి పొందారుని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులను ఢీకొన్న 108 అంబులెన్స్ లోని గుండె పోటు రోగిని తిరుపతి నుంచి 108 వాహనం రప్పించి పోలీసులు ఆ వాహనంలో తిరుపతికి తరలించారు. మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను పోలీసులు శవ పరీక్ష నిమిత్తం తిరుపతి మెడికల్ కళాశాలకు తరలించారు. తీవ్ర గాయాలు పాలైన ఐదుగురిలో కూడా తులసమ్మ పరిస్థితి విస్మయంగా ఉంది, మెరుగైన వైద్య చికిత్స కోసం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. నలుగురు క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి బాగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చంద్రగిరి సీఐ సుబ్బరామిరెడ్డి తెలిపారు. చంద్రగిరి మండలం నరసింగాపురం సమీపంలోని నారాయణ కాలేజీ వద్ద జరిగిన ప్రమాదంలో క్షతగాత్రులైన ఐదు మంది శ్రీవారి భక్తులకు మెరుగైన వైద్యం సేవలు అందించి ప్రాణాలను కాపాడాలని తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులను చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి వెంకట మణి ప్రసాద్ ( నాని) కోరారు. మృతదేహాలకు త్వరితగతిన శవ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను బంధువులకు అప్పజెప్పాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు చరవాణి ( ఫోన్లో )ద్వారా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు,

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News