Monday, December 23, 2024

ఆరోగ్యానికి హాని

ఆరోగ్యానికి హానికరంగా మారిన గుట్కాపై నిషేధాన్నిమరో ఏడాది పాటు పొడిగిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేర‌కు గుట్కా తయారీ, క్రయవిక్రయాలను నిషేధిస్తూ ఫుడ్ సేఫ్టీ విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. గుట్కా, పాన్ మసాలాల్లో ఆరోగ్యానికి హాని క‌లిగించే పొగాకు, నికోటిన్ ఉండ‌డం మూలంగానే వాటిని నిషేధించిన‌ట్లు పేర్కొంది. 2025 మే 24 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని, గుట్కాను త‌యారు చేసినా, నిల్వ ఉంచినా, విక్రయాలు జ‌రిపినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. అయితే తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాలు గుట్కా విక్రయాలపై ఇలాంటి నిర్ణయమే తీసుకున్నా.. ఇప్పటికీ క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. నిబంధనలు సరిగా అమలు చేయలేకపోవడం, కోర్టు కేసుల కారణంగా అడ్డంకులు వస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా గుట్కా, పొగాకు విక్రయాలను నిషేధిస్తూ పార్లమెంటులో చట్టం చేస్తేనే సత్ఫలితాలు వచ్చే అవకాశముంది.

వివిధ రాష్ట్రాల్లో నిషేధించినా..
ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2011 ప్రకారం పొగాకు ఉత్పత్తులపై 2012 నుంచి పలు రాష్ట్రాలు వాటిని నిషేధించడం మొదలుపెట్టాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం 2013 జనవరి 9న గుట్కా ఉత్పత్తులను నిషేధించింది. ఏటా నిషేధం కొనసాగించేలా గెజిట్‌ జారీ చేసింది. అయితే గుట్కాను మాత్రమే నిషేధించడంతో పొగాకుతో తయారయ్యే పాన్‌మసాలా ఉత్పత్తులు మార్కెట్‌లో బాగా పెరిగాయి. దీంతో 2014 జనవరి 9న సమగ్రంగా ఆదేశాలు ఇచ్చింది. నికోటిన్, పొగాకు ఆనవాళ్లు ఉండి నోటి ద్వారా తీసుకునే అన్ని ఉత్పత్తులపైనా నిషేధం విధించింది. చాప్‌ టొబాకో, ప్యూర్‌ టొబాకో, ఖైనీ, ఖారా, పొగాకు ముక్కలు, పొగాకు ఆనవాళ్లు ఉండేవన్నీ నిషేధిత జాబితాలో ఉంటాయని వివరణ ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కూడా ఇవే ఆదేశాలు అమలవుతున్నాయి.

కోర్టు కేసులతోనూ అడ్డంకులు
గుట్కా, పాన్ మసాలాలపై నిషేధాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో 160 పిటిషన్లు దాఖలు కాగా, 2021 నవంబర్ లో వీటన్నింటిని న్యాయస్థానం కొట్టివేసింది. గుట్కా నిషేధాన్ని సమర్థించింది. అయితే ఆ తర్వాత వ్యాపారులు సుప్రీం కోర్టును ఆశ్రయించి నిషేధంపై స్టే తెచ్చుకున్నారు. గుట్కా క్రయవిక్రయాలు జరిపే వారిపై పోలీసులు కేసులు పెట్టడాన్ని తెలంగాణ హైకోర్టులోనూ సవాల్ చేశారు. దీంతో సరుకులు సీజ్ చేయొద్దని, గుట్కా ఉత్పత్తుల తయారీ, సరఫరా, విక్రయదారులపై కేసులు పెట్టవద్దని హై కోర్టు పోలీసులకు సూచించింది. తమిళనాడులోనూ 2018లో గుట్కాపై నిషేధం విధించగా.. దీన్ని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ లోనూ దాదాపు ఇలాగే జరిగింది. అయితే తమిళనాడు ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా, 2023 ఏప్రిల్ లో హై కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. దీంతో నిషేధం కొనసాగినట్లయింది.

విఫలమవుతున్న నియంత్రణ చర్యలు
పొగాకు ఉత్పత్తుల వినియోగంపై 2014లో భారత్ చట్టం చేసింది. దీని తరువాత సిగరెట్ పెట్టెపై ‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం’ అనే పదాలు రాయాలని సూచించింది. ఈ నిర్ణయంపై సిగరెట్ తయారీదారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 2016లో సుప్రీం కోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. అంతేకాకుండా పొగతాగే అలవాటును మాన్పించడాన్ని అనేక రకాలైన ఆంక్షలను అమల్లోకి తెచ్చారు. గుట్కాను నిషేధించడం, బహిరంగ ప్రదేశాలలో సిరెట్లు తాగనివ్వకపోవడం, పొగాకు ఉత్పత్తుల ప్రచారాలపై నిషేధం, పద్దెనిమిదేళ్లలోపు పిల్లలకు పొగాకు ఉత్పత్తులను విక్రయించకుండా ఉండడం, పాఠశాలలు, కళాశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధించారు. సిగరెట్ ప్యాకెట్లు, గోడలు, బిల్ బోర్డులు, హోర్డింగులు, సినిమా థియేటర్లలో, ఇంకా అనేక మార్గాల్లో పొగాకు తాగడం హానికరమంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. పన్నులు కూడా భారీగా పెంచారు. అయితే వాటితో అనుకున్నంత సత్ఫలితాలు కనిపించలేదు. ఎంతగా ప్రచారం చేసినా… సిగరెట్లు, బీడీలు, గుట్కా, ఖైనీల రూపంలో పొగాకు వాడకం ఏటేటా పెరుగుతోందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.

ఏటా పెరుగుతున్న క్యాన్సర్ బాధితులు
పొగాకు, నికోటిన్‌ ఉత్పత్తుల వినియోగంతో అధిక శాతం మంది నోటి క్యాన్సర్ బారినపడుతున్నారు. గ్లోబల్ అడల్ట్ టుబాకో సర్వే (జీఏటీఎస్) ప్రకారం.. సిగరెట్లు, బీడీల కంటే ఎక్కువగా పొగ రహిత పొగాకుకే ప్రజలు ఆకర్షితులవుతున్నారని తేలింది. దాదాపు 26 శాతం మంది పెద్దలు పొగలేని పొగాకును ఉపయోగిస్తున్నారని, స్మోక్‌లెస్ పొగాకు వాడకం మహిళల్లో 18.4 శాతం ఎక్కువగా ఉందని నిర్ధారించారు. 12 శాతం మంది పురుషులు, 27 శాతం మంది మహిళలు పదిహేనేళ్లు నిండకముందే పొగలేని పొగాకును ఉపయోగించడం ప్రారంభిస్తున్నట్లు గుర్తించారు. పొగాకు సంబంధిత అలవాట్లు కారణంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా 80 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది. పొగాకు ఉత్పత్తులను నేరుగా వాడేవారు 70 లక్షల మంది చనిపోతుంటే 10 నుంచి 13 లక్షలమంది పాసివ్ స్మోకింగ్ కారణంగా మృత్యువాత పడుతున్నారు. వీరిలో మహిళలే అధికం. భారత దేశంలో సుమారు 27 కోట్ల మంది పొగాకును ఉపయోగిస్తుంటే.. ఇందులో పది కోట్ల మంది వరకు సిగరెట్లు, బీడీలు తాగే వారు ఉన్నారు. ఇండియాలో స్మోకింగ్ వల్ల ఏటా 12 లక్షల మంది, పొగాకు నమలడం వల్ల 3.5 లక్షల మంది చనిపోతున్నారు. 2018లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్స్ రిసెర్చ్ చేసిన సర్వేలో సిగరెట్లు తాగే వారిలో 46 శాతం మంది నిరక్షరాస్యులని, 16 శాతం మంది కాలేజ్ విద్యార్థులని తేలింది.

ప్రత్యామ్నాయ జీవనోపాధిని చూపిస్తే..
పొగాకు ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వ పన్ను రాబడిలో రూ.50వేల కోట్లకు పైగా జమ అవుతున్నాయి. దీని ద్వారా వార్షిక విదేశీ మారకపు ఆదాయం 2022-23లో రూ. 9,000 కోట్లుగా ఉన్నది. ఇండియాలో 4.64 లక్షల హెక్టార్లలో పొగాకు సాగవుతున్నది. దాదాపు 80 కోట్ల కిలోల వార్షిక ఉత్పత్తితో దేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పొగాకు ఉత్పత్తిదారుగా ఉన్నది. ముఖ్యంగా పొగాకును ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్ర, బీహార్‌, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలలో ఎక్కువగా పండిస్తున్నారు. దాదాపు 2.6 కోట్ల మంది రైతులు, వ్యవసాయ కార్మికులు పొగాకు ద్వారా జీవనోపాధి పొందుతున్నారు. మొత్తం 4.57 కోట్ల మంది ప్రజలు పొగాకుపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇందులో పాన్ టేలాలు నడిపే వారు కూడా ఉన్నారు. అయితే పొగాకు ఉత్పత్తులపై పూర్తిస్థాయి నిషేధం విధించే ముందు పొగాకుపై ఆధారపడి జీవిస్తున్న రైతులు, చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపెట్టాలి. ఆ తర్వాత నియంత్రణ చర్యలు మానుకొని పూర్తిస్థాయి నిషేధం విధించేలా అడుగులు వేయాలి. అవసరమైతే పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేయాలి. అప్పుడే పొగాకు ఉత్పత్తుల ద్వారా కలిగే దుష్పరిణామాల నుంచి దేశాన్ని, దేశప్రజలను కాపాడుకోగలుగుతాం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News