- క్షయ వ్యాధి నియంత్రణ వ్యాక్సిన్
- డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత
నేటి సాక్షి, కరీంనగర్: దేశం, తెలంగాణలో క్షయ వ్యాధి అరికట్టాల్సిన అవసరం, ఆవకాశ్యత ఉందని డీఎంహెచ్‌వో డాక్టర్ సుజాత పేర్కొన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ ఎడ్యుకేటర్లకు క్షయ నియంత్రణ వ్యాక్సిన్‌పై ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సుజాత ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పటి వరకు జిల్లాలో క్షయ వ్యాధి నియంత్రణకు 0 నుంచి ఐదేండ్ల పిల్లలకు మాత్రమే ఇస్తారని చెప్పారు. క్షయ నివారణ కోసం ఇక నుంచి 18 ఏండ్లు పైబడిన వారికి కూడా క్షయ వ్యాధి నియంత్రణ వ్యాక్సిన్ ఇస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం 18 ఏండ్లు పైబడిన వారికి, ముఖ్యంగా బరువు తక్కువ ఉన్నవారు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, టీబీ వ్యాధి సోకిన వారితో నివసించే కుటుంబ సభ్యులు తప్పని సరిగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలని కోరారు. జిల్లా టీబీ అధికారి డాక్టర్ కేవీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైద్యులు అతుల్ నిగమే, విష్ణు, ఆదిత్య శిక్షణ ఇచ్చారు. డీఐఓ డాక్టర్ సాజీదా అతహరి, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ చందు, ఎంసీహెచ్ పీవో డాక్టర్ సనా జవేరియా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, హెల్త్ సూపర్వైజర్లు, హెల్త్ ఎడ్యుకేటర్లు పాల్గొన్నారు.