నేటి సాక్షి, నల్లబెల్లి డిసెంబర్ 27 : నల్లబెల్లి మండలంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు సామాజిక–రాజకీయంగా స్పష్టమైన మార్పును ప్రతిబింబించాయి.మొత్తం 29 గ్రామపంచాయతీల్లో 15 గ్రామపంచాయతీలు బీసీ వర్గాలే గెలుచుకోవడం విశేషంగా నిలిచింది.బీసీ సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 8 స్థానాలు గెలిచి ఆధిపత్యం సాధించగా,బి.ఆర్.ఎస్ 6, బీజేపీ ఒక బీసీ సర్పంచ్ స్థానాన్ని దక్కించుకున్నాయి.బీసీలకు రిజర్వ్ అయిన 11 గ్రామపంచాయతీలతో పాటుజనరల్కు రిజర్వ్ అయిన ఐదు గ్రామపంచాయతీల్లో నాలుగింటిని బీసీలే గెలుచుకోవడం గమనార్హం.ఇది మండలంలో బీసీ రాజకీయ చైతన్యం బలపడిందనడానికి నిదర్శనంగా కనిపిస్తోంది.మండలంలోని ఐదు జనరల్ స్థానాల్లో ఒక్క ఓసి అభ్యర్థి కూడా గెలవకపోవడం ఎన్నికల ప్రత్యేకతగా మారింది.కేవలం కనరావుపేట గ్రామపంచాయతీలో మాత్రమే ఇద్దరు ఓసి అభ్యర్థులు బరిలో నిలవగా,అక్కడ కూడా బీసీ అభ్యర్థి ఓసి అభ్యర్థులపై ఘన విజయం సాధించారు.మిగిలిన నాలుగు జనరల్ స్థానాల్లో ఓసి అభ్యర్థులు పోటీకి ముందుకు రాకపోవడం,బీసీల ప్రభంజనానికి ఓసీలు వెనుకడుగు వేసినట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.ఇక ఎస్టీలకు రిజర్వ్ అయిన 10 గ్రామపంచాయతీలతో పాటు ఒక జనరల్ స్థానాన్ని కూడా ఎస్టీ అభ్యర్థి గెలుచుకొనిమొత్తం 11 సర్పంచ్ స్థానాలు ఎస్టీలు కైవసం చేసుకున్నారు.వాటిలో 7 స్థానాలు బి.ఆర్.ఎస్, 4 స్థానాలు కాంగ్రెస్ గెలవడంతోఎస్టీ సర్పంచుల్లో బి.ఆర్.ఎస్ ఆధిపత్యం కొనసాగింది.ఎస్సీలకు రిజర్వ్ అయిన మూడు గ్రామపంచాయతీలను బి.ఆర్.ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచిఎస్సీ వర్గంలోనూ పార్టీ పట్టు నిలుపుకుంది.మొత్తంగా నల్లబెల్లి మండలంలో కొంతకాలంగా సాగుతున్న బీసీ పోరాటాల ఫలితాలుఈ ఎన్నికల్లో స్పష్టంగా ప్రతిబింబించాయని,బీసీల రాజకీయ ప్రభంజనం కొత్త దిశను సూచిస్తోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

