Monday, December 23, 2024

75 ఏండ్లుగా రెడ్డిలు, వెలమ వర్గాలే

నేటి సాక్షి, తెలంగాణ ప్రతినిధి: 75 ఏండ్ల నుంచి ఏకధాటిగా కేవలం రెడ్డి, వెలమ వర్గాల వారే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నారని, ఇక వారి ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని నేషనల్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్(ఎన్పీజేఎఫ్​) చైర్మన్​ వీజీఆర్​ నారగోని పేర్కొన్నారు. హైదరాబాద్​లోని ప్రెస్​క్లబ్​లో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లభించాలన్న ఆశయంతో ఎన్పీజేఎఫ్​ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి రోజున తాము ఈ ఫ్రంట్ ఏర్పాటుకు అంకురార్పణ చేశామన్నారు.

ఏడున్నర దశాబ్దాల కాలంగా వెలమ దొరలు, రెడ్డిలు, పటేళ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యావత్తు బడుగు బలహీన వర్గాల వారిని రాజకీయ బానిసలుగా మార్చేసుకున్నారని ఆరోపించారు. ఇకపై ఈ రెండు వర్గాల వారు పరిపాలన కొనసాగడానికి వీల్లేదన్నారు. కాంగ్రెస్, బీజెపీ, బీఆర్ఎస్ పార్టీలు అన్ని కులాలకు అసెంబ్లీ, పార్లమెంటులో ప్రాతినిధ్యం కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజకీయ మార్పు జరగాల్సిన అవసరం ఇప్పుడు ఉందని, దీనికి ఒక కొత్త విప్లవానికి నాంది పలకల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

అన్ని కులాలు, మతాలు, వర్గాల వారికి సమానంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించాలన్న ఆశయంతో ఎన్పీజేఎఫ్​ ద్వారా ‘సీట్లు ఇవ్వని పార్టీలకు ఓట్లు వేయబోమని’ ఓటు నిరాకరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్టు నారగోని వెల్లడించారు. ఇందుకు జూలై -15 నుంచి అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు, ఉద్యమ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు ఆయన వివరించారు. త్వరలో పూర్తి స్థాయిలో కోర్ కమిటీ ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సదస్సులో వైస్ చైర్మన్లు సూర్యనారాయణ, ఎండీ సలీం, కన్వీనర్లు మాదరబోయిన నర్సయ్య, కొంకటి లక్ష్మణ్, బోయ గోపి, బాలాజీ, వెంకటస్వామి, పొడేటి పాల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News