నేటి సాక్షి,నారాయణపేట డిసెంబర్ 16,మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో, నిస్పక్షపాతంగా, నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS పిలుపునిచ్చారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పనిచేస్తూ, ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించాలని పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు.నారాయణపేట జిల్లాలో మొదటి రెండవ విడతల్లో పోలీసులు బాగా పనిచేశారని అదే ఉత్సాహంతో మూడో విడత కూడా బాగా పని చేయాలని సూచించారు. నారాయణపేట జిల్లాలోని మక్తల్, మాగనూరు, కృష్ణ, ఉట్కూర్, నర్వ మండలాల్లో జరిగే సర్పంచ్ ఎన్నికల విధుల నిమిత్తం మక్తల్ పట్టణ కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్ లో హాజరైన పోలీసులకు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ భద్రతాపరమైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడవ విడత ఎన్నికల కోసం 800 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఐదు మండలాలను మొత్తం 29 రూట్లుగా విభజించి భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు 05 స్ట్రైకింగ్ ఫోర్సులు, 05 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సులు ఏర్పాటు చేసి నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.పోలింగ్ కేంద్రాల వద్ద విధులు నిర్వహించే పోలీసులతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని, మొబైల్ రూట్లు, ఆయా పరిధిలోని గ్రామాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలింగ్ రోజు పాటించాల్సిన నిబంధనలను వివరించి, అల్లర్లకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల రోజు నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.పోలింగ్ రోజున పోలింగ్ స్టేషన్ల సమీపంలో 163 (బి.ఎన్.ఎస్.ఎస్) యాక్ట్ అమల్లో ఉంటుందని, పోలింగ్ కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో అనవసర రాకపోకలను అనుమతించరాదన్నారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్లు, ఇంక్ బాటిల్స్ లేదా ఇతర హానికర వస్తువులు తీసుకురాకుండా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పై అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ఊరేగింపులు, ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు.ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హూల్ హాక్, డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్, రఘునాథ్, సీఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

