- నాలుగో తేదీ వరకు అప్రమత్తంగా ఉండాలి
- స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రతను ఎప్పటికప్పుడు పరిశీలించాలి
- తప్పిదాలకు అవకాశం ఉండొద్దు
- భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్
నేటి సాక్షి, కరీంనగర్: వచ్చేనెల 4న జరిగే ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. సోమవారం ఢిల్లీలోని తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఈవోలు, జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు జాగ్రత్తలు, సూచనలను జారీ చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లోని ఎన్ఐసీ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దేశాయ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఉదయం సాయంత్రం ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ల వద్ద భద్రతను పర్యవేక్షించాలని పేర్కొన్నారు. గట్టి భద్రత ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి తప్పిదాలు జరగకుండా ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని తెలిపారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈవీఎంలను జాగ్రత్తగా తీసుకెళ్లాలని సూచించారు. ఈవీఎంలు సరిగా ఉన్నాయా? లేదా? అని సరి చూసుకోవాలని తెలిపారు. ఏజెంట్ల సమక్షంలో పారదర్శకంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహించాలని పేర్కొన్నారు. ఎక్కడ ఎలాంటి తప్పిదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కౌంటింగ్ హాలు వద్ద గట్టి భద్రతను ఏర్పాటు చేయాలని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారని అభినందనలు తెలిపారు. ఇదేవిధంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. అధికారులందరూ బాధ్యతయుతంగా విధులు నిర్వర్తించాలని, నిర్లక్ష్యానికి ఎక్కడ చోటు ఉండవద్దని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సూచించారు. కార్యక్రమంలో డీఆర్ఓ పవన్ కుమార్, జడ్పీ సీఈఓ శ్రీనివాస్, పరిశ్రమల శాఖ జీఎం నవీన్ కుమార్, మైనింగ్ శాఖ ఏడి రామాచారి, డీపీఓ రవీందర్, డిఆర్డిఓ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.