- హిందూ ధర్మం, జాతీయ వాదానికే సేవికా సమితి ప్రాధాన్యం
- తెలంగాణ ప్రాంత కార్యవాహిక శ్రీపాద రాధ
నేటి సాక్షి, కరీంనగర్: మహిళలు కుటుంబానికే కాకుండా సమాజానికి, దేశానికి కూడా స్ఫూర్తిదాయక శక్తిగా ఉండి, వారిని స్వశక్తులు, ఆత్మనిర్బురాలుగా చేయడమే లక్ష్యంగా.. హిందూ ధర్మం, జాతీయ వాదంతో ముందుకు కొనసాగే ఏకైక మహిళా సంస్థ రాష్ట్ర సేవికా సమితి అని తెలంగాణ ప్రాంత కార్య వాహిక మాననీయ శ్రీపాద రాధ తెలిపారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీకాలనీలోని ప్రభుత్వ డైట్ కళాశాలలో గురువారం రాష్ట్ర సేవికా సమితి ప్రబోధ్ ద్వితీయ సంవత్సర శిక్షావర్గ (ముగింపు) సమారోప్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి కార్యక్రమానికి ముఖ్యవక్తగా ఆమె హాజరై మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్ర సేవికా సమితి సానుకూల సామాజిక సంస్కరణల కోసం కృషి చేస్తూ, సమాజంలో హిందూ మహిళల పాత్రపై దృష్టి సారిస్తుందని చెప్పారు. సమితిలోని సభ్యులకు (మాతృత్వం ) (సమర్థత సామాజిక క్రియాశీలత) (నాయకత్వం) అనే మూడు ఆదర్శాలను ప్రధానంగా బోధిస్తుందని అన్నారు. స్త్రీ శక్తి ఆరాధన ప్రబలంగా ఉన్న అరుదైన సంస్కృతుల్లో భారత్ ఒకటన్నారు. మహాలక్ష్మి , మహా సరస్వతి , మహాదుర్గలను , పవిత్రమైన గంగను, పవిత్రమైన ఆవును పూజించాలని మన సంస్కృతి నేర్పుతుందని చెప్పారు. దేశాన్ని మాతృభూమిగా ప్రేమగా సంబోధిస్తామన్నారు. స్త్రీలందరూ సంఘంలో సానుకూల మార్పును సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారని సమితి విశ్వసిస్తుందన్నారు. సమాజంలో మాతృశక్తికి తగిన ప్రాముఖ్యత , గౌరవం లభించినప్పుడే దేశం పూర్తి సామర్థ్యాన్ని, ప్రాచీన వైభవాన్ని సాధిస్తుందని అన్నారు. ప్రముఖ న్యూట్రిషన్, డైటిషన్, ఫిట్నెస్ ట్రైనర్ దీప్తి మాట్లాడుతూ రాష్ట్ర సేవికాసమితి చేపట్టిన శిక్షణ కార్యక్రమం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ముఖ్యంగా శారీరక్, మానసిక, భౌతిక వికాసం జరగాలనే ఉద్దేశంతో జరిగిన 15 రోజులు శిక్షణ కార్యక్రమం మహిళల జీవితాలకు మార్గదర్శనంల నిలుస్తాయన్నారు. అలాగే సమాజంలో సానుకూలమైన దృక్పథంతో కూడుకున్న దేశభక్తిని నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. భారతీయులందరూ సక్రమంగా వారి బాధ్యతలను నిర్వర్తించడమే అసలైన దేశభక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి తెలంగాణ ప్రాంత కార్యకారిణి జానకి, సింధు దీదీ, ప్రొద్దుటూరి రూప, లెక్కల రమ, గుదిమెల్ల అనిత, జిల్లా, నగర కార్యకారిణి బూర్ల విజయలక్ష్మి, జయప్రద, కవిత, మానస, పలు జిల్లాల కార్యకర్తలు పాల్గొన్నారు.