- పండుగలా బడిబాట నిర్వహించండి
- బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించండి
- పాఠశాలల్లో పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలి..
- కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
- ముంజంపల్లి, జగ్గయ్యపల్లి పాఠశాలల్లో అభివృద్ధి పనుల పరిశీలన
నేటి సాక్షి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బడి బాట కార్యక్రమాన్ని గ్రామాల్లో పండుగలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. శుక్రవారం మానకొండూర్ మండలం ముంజంపల్లి, జగ్గయ్యపల్లి గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో ఏమేం పనులు చేపట్టారు? ఎంత వ్యయం? పనులు ఎంత వరకు పూర్తయ్యాయి? అని అడిగి తెలుసుకున్నారు. పనులు నాణ్యతతో చేపట్టాలని, విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బడీడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పేర్కొన్నారు. హాజరు శాతాన్ని పెంచాలని, ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో చదువు పూర్తయిన తర్వాత చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పేర్కొన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాలలకు కొత్త రూపు తీసుకు వస్తున్నామని చెప్పారు. తాగునీరు, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్ నిర్మాణం, గదుల్లో ఫ్లోరింగ్ తోపాటు పలు పనులు చేయిస్తున్నామని తెలిపారు. జూన్ 4 లోపు ఏ ఒక్క పని మిగిలి పోకుండా చూడాలని పేర్కొన్నారు. పనులకు సంబంధించిన ఎంబీ రికార్డులను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సైతం వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. కిచెన్ షెడ్ల నిర్మాణంతోపాటు ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జూన్ 4వ తేదీ లోపు పనులు పూర్తి చేసి పాఠశాలలను అందంగా రెడీ చేయాలని సూచించారు. ఇందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో జనార్దన్ రావు, ఎంపీడీవో నర్సయ్య, ఎంఈఓ మధుసూదనాచారి, తదితరులు పాల్గొన్నారు.