- – రైతులు విభిన్న రకాల పత్తి విత్తనాలను వాడాలి
- – లైసెన్స్డ్ దుకాణాల్లోనే విత్తనాలు, పురుగు మందులను కొనాలి
- – రసీదులు తప్పకుండా భద్రపరుచుకోవాలి
- – విత్తనాల కొరత రావద్దు.. రైతులు ఇబ్బందులు పడొద్దు
- – కలెక్టర్ కలెక్టర్ పమేలా సత్పతి
- – కరీంనగర్లో ఆకస్మికంగా విత్తనాలు, పురుగుమందుల ఏజెన్సీల్లో తనిఖీ
నేటి సాక్షి, కరీంనగర్: రైతులు విభిన్న రకాల కంపెనీల పత్తి విత్తనాలను సాగుకు వాడాలని, ఒకే రకంపై ఆధారపడవద్దని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. శుక్రవారం కరీంనగర్లోని గాంధీ రోడ్లో వైష్ణవి, మార్కెట్ రోడ్లోని రెడ్డి విత్తనాలు, పురుగుమందుల దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పత్తి విత్తనాల విక్రయాలపై దుకాణ యజమానుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఏ రకం పత్తి విత్తనాలను రైతులు అధికంగా కొంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ఎందుకు ఒకే విధమైన పత్తి విత్తనాన్ని కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం రిజిస్టర్లను పరిశీలించారు. ప్రొఫార్మా ప్రకారం రైతుల వివరాలు నమోదు చేస్తున్నారా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. రెడ్డి ఏజెన్సీలో పత్తి విత్తనాలు కొనుగోలు చేసిన రైతుతో వ్యవసాయ అధికారితో ఫోన్లో మాట్లాడించి, వివరాలు తెలుసుకున్నారు. ఆయన చెప్పిన వివరాలు.. దుకాణంలో ఉన్న వివరాలను కలెక్టర్ సరి చూసుకున్నారు. రైతుల వివరాలు పక్కాగా నమోదు చేయాలని సూచించారు. పత్తి విత్తనాల ప్యాకెట్లను స్వయంగా పరిశీలించారు. వాటికి సంబంధించిన ధర, ఎంత వెయిట్ ఉంటుందనే వివరాలను కనుక్కున్నారు. అలాగే గోదాముల్లో నిల్వ ఉంచిన పత్తి విత్తనాల బ్యాగులు, వరి విత్తనాల బ్యాగులను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పత్తి విత్తనాలను నిబంధనలను ప్రకారం విక్రయించాలని సూచించారు. రైతులు ఒకే రకమైన పత్తి విత్తనాన్ని ఎక్కువగా వాడవద్దని, విభిన్న రకాలను పంటల సాగులో వాడాలని పేర్కొన్నారు. విత్తనాలు, పురుగుమందుల కొరత రాకుండా ముందు జాగ్రత్తగా ఎప్పటికప్పుడు వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. వ్యాపారులు నిబంధనలను పాటించాలని, లైసెన్సులను గడువు దాటక ముందే రెన్యువల్ చేసుకోవాలని ఆదేశించారు. రైతులు లైసెన్సులు కలిగిన వ్యాపారుల వద్దే విత్తనాలు, పురుగు మందులను కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. కొనుగోలు చేసే సమయంలో రసీదులు తప్పకుండా తీసుకుని భద్రపరుచుకోవాలని తెలిపారు. రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత వ్యాపారులు, వ్యవసాయ అధికారులపై ఉందని చెప్పారు. రైతులు లైసెన్సులు లేని వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బత్తిని శ్రీనివాస్, కరీంనగర్ ఏడిఏ రణధీర్ రెడ్డి, అర్బన్ వ్యవసాయ అధికారి హరిత, తదితరులు పాల్గొన్నారు.