నేటి సాక్షి, రాజేందర్‌నగర్: హైదరాబాద్‌లోని పుప్పాలగూడలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కుప్పకూలింది. అల్కాపూర్ రోడ్డు నెం.14 వద్ద స్లాబ్ వేస్తుండగా, ప్రమాదం సంభవించింది. బిల్డర్స్ నాసిరకమైన మెటీరియల్ వాడటంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు చెప్పారు. కుప్పకూలిన స్లాబ్ వీడియోలు చిత్రీకరించడానికి వెళ్లిన మీడియాపై నిర్మాణ సంస్థకు చెందిన వారు దాడికి యత్నించారు. ఇక్కడ ఏమి కాలేదని దౌర్జన్యం చేశారు. బిల్డింగ్ ఇరువైపుల రోడ్డును అధికారులు మూసివేశారు. కార్మికుల ప్రాణాలతో నిర్మాణ సంస్థలు చెలగాటం ఆడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. భద్రతా చర్యలు తీసుకోవడంలో యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ట్రాక్టర్ బోల్తా పడి, కార్మికుడు మృతి చెందాడని తెలిసింది. నిబంధనలు అతిక్రమిస్తున్న బిల్డర్స్పై ప్రభుత్వం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రాణ నష్టం జరిగేదాకా వేచి చూడకుండా, ముందస్తు చర్యలకు ఉపక్రమించాలని సూచిస్తున్నారు.