నేటి సాక్షి, బెజ్జంకి: భార్య చికెన్ వండలేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పోతారం గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కరంనే దశరథం(40), అతని భార్య సంగోలి, ముగ్గురు పిల్లలతో కలిసి మూడేండ్ల క్రితం పోతారం గ్రామ శివారులోని ఓ కోళ్ల ఫారంలో పనిచేసేందుకు వచ్చారు. మే 30న ఆరోగ్యం బాగాలేదని దశరథం దవాఖానకు తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తనకు చికెన్ వండి ఇవ్వమని భార్యతో గొడవపడగా, భార్య డాక్టర్ తినవద్దన్నాడని అనడంతో గొడవ మొదలైంది. అదేరోజు దశరథం క్రిమిసంహారక మందు తాగాడు. దాంతో అతడిని కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించగా, శనివారం మృతి చెందాడు. సంగోలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణారెడ్డి వివరించారు.