– యజమానులు నిబంధనలు అతిక్రమించకుండా చూడాలి
– గనులు, భూగర్భ శాఖ కార్యదర్శి, టీజీఎండీసీ ఎండీ ఆదేశం
నేటి సాక్షి, కరీంనగర్: జిల్లాలో గ్రానైట్ క్వారీల యజమానులు ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించకుండా ఎప్పటికప్పుడు అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ కార్యదర్శి, టిజి ఎండీసీ ఎండీ సురేంద్రమోహన్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కరీంనగర్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి ఆయన గనులు, భూగర్భ శాఖకు సంబంధించి వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో గ్రానైట్ క్వారీలు, సాండ్ టాక్స్, రెవెన్యూ, జరిమానాల వసూలు, వివిధ అంశాలను వివరంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సురేంద్రమోహన్ మాట్లాడుతూ అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని సూచించారు. క్వారీల లీజులకు సంబంధించిను అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. లీజు గడువు ముగియకముందే ముందే నిర్వాహకులకు సమాచారం అందించి రెన్యువల్ చేయించాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమించకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మన ఇసుక విధానం ద్వారా ఆన్లైన్లో ఇసుక బుకింగ్ చేసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సత్వరమే సరఫరా చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసు కోవాలని పేర్కొన్నారు. అన్ని అంశాలను వివరంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఇసుక అక్రమంగా రవాణా చేయకుండా కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొన్నారు. ట్రాక్టర్ యజమానులపై కేసులు సైతం నమోదు చేస్తున్నామని వివరించారు. ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నామని చెప్పారు.ఇసుక అవసరం ఉన్నవారు ఆన్లైన్లో బుక్ చేసుకుని తెప్పించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గనులు, భూగర్భ శాఖ వరంగల్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ ఎం వెంకటేశ్వర్లు, కరీంనగర్ అసిస్టెంట్ డైరెక్టర్ రామాచారి, టీజీఎండిసి ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

