Sunday, January 18, 2026

పర్యావరణాన్ని పరిరక్షించాలి

  • కరీంనగర్​ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

నేటి సాక్షి, కరీంనగర్​: ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, తద్వారా మానవాళికి ఎంతో ప్రయోజనం కలుగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్​తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మహిళలందరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘాలు తలుచుకుంటే ఏ పనైనా సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పర్యావరణం దెబ్బతినకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎన్నో సంవత్సరాలుగా పెంచిన చెట్లను ఇష్టం వచ్చినట్లు నరికి వేయవద్దని, చిన్నపిల్లలను పెంచినట్లు వాటిని చూసుకోవాలని పేర్కొన్నారు. పొలాల్లో వరి కొయ్యలను కాల్చి వేయవద్దని, ఇలా చేస్తే చెట్లు దెబ్బతింటాయని తెలిపారు. చెట్లతోనే మానవాళికి ఎంతో ప్రయోజనం చేకూరుతున్నదని చెప్పారు. ప్రతి ఇంట్లో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని, కూరగాయల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే ఇంకుడు గుంతలు, మరుగు దొడ్లు నిర్మించుకోవాలని, పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఎక్కడపడితే అక్కడ గ్రామాల్లో చెత్తను పడేయవద్దని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఉపాధి హామీ పథకం ద్వారా అనేక పనులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కుక్కలు, కోతుల పట్ల దయ చూపాలని, వాటికి తగిన ఆహారం అందించాలని సూచించారు. ప్రజలందరం కలిసి పర్యావరణాన్ని కాపాడుకుందామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతోనే మానవాళికి ఎంతో లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాలని, అలాగే పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టాలని పేర్కొన్నారు. ఉపాధి పనులను కూలీలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో డీఆర్డీవో శ్రీధర్, డీపీఓ రవీందర్, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, యూనిసెఫ్ జిల్లా కోఆర్డినేటర్ కిషన్ స్వామి, ఎంపీడీవో సంజీవరావు, ఎంపీఓ జగన్మోహన్ రెడ్డి, ఈజీఎస్ ఏపీవో శోభారాణి, ఉపాధి హామీ కూలీలు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News