- – పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలి
- – సజావుగా జరిగేలా చూడాలి
- – పొరపాట్లు జరగకుండా సూచుకోవాలి
- – నిబంధనలపై అభ్యర్థులకు అవగాహన ఉండాలి
- – గ్రూప్-1 ప్రిలిమ్స్ నోడల్ ఆఫీసర్ ప్రఫుల్ దేశాయ్
నేటి సాక్షి, కరీంనగర్: ఆదివారం జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు అధికారులంతా పక్కాగా శనివారంలోగా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, గ్రూప్-1 నోడల్ ఆఫీసర్ ప్రఫుల్ దేశాయ్ ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాల రూట్ ఆఫీసర్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్లకు శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరీక్షకు సంబంధించి టీజీపీఎస్సీ రూపొందించిన నిబంధనలపై వారికి అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. టీజీపీఎస్సీ రూపొందించిన నిబంధనలపై అధికారులతో పాటు అభ్యర్థులకు అవగాహన ఉండాలని పేర్కొన్నారు. అధికారులు శనివారం వరకే ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు వాటి పనితీరు.. తాగునీరు.. టాయిలెట్స్ ఇతర వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సీటింగ్ అరేంజ్మెంట్లు పక్కగా చేయాలని, అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చూడాలని తెలిపారు. ఒక గదిలో 24, 48, 72 మంది ఉండేలా చూసుకోవాలని చెప్పారు కరీంనగర్లో 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 18,663 మంది అభ్యర్థులు పరీక్ష రాయన్నారని వివరించారు. అభ్యర్థులు మూడోసారి ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్నారని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగవద్దని, అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయా సెంటర్ల వద్ద ఒకే గేటును మాత్రమే ప్రవేశానికి ఉంచాలని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల వద్ద సెంటర్ కోడ్, సెంటర్ పేరు పెద్ద అక్షరాలతో ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అభ్యర్థులు ఒకరోజు ముందే పరీక్ష కేంద్రం వద్దకు వెళ్లి పరిశీలించాలని చెప్పారు. ఈ నెల 9న ఆదివారం ఉదయం 9 గంటల వరకే అభ్యర్థులంతా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. 9:30 గంటల నుంచి బయోమెట్రిక్ విధానం ద్వారా హాజరు తీసుకుంటారని తెలిపారు. 10 గంటలకు ఆయా పరీక్ష కేంద్రాల గేట్లు మూసివేస్తారని, ఆ తర్వాత వచ్చే అభ్యర్థులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఉదయం 10:30 నుంచి 1:00 వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. పరీక్ష జరుగుతున్న సమయంలో అరగంటకు ఒకసారి బెల్ మోగిస్తారని చెప్పారు. అభ్యర్థులందరికీ బెల్ వినిపించేలా ఏర్పాట్లుచేపట్టాలని సూచించారు. అభ్యర్థులంతా టీజీపీఎస్సీ రూపొందించిన నిబంధనలు కచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆయా పరీక్ష జరిగే సమయంలో కేంద్రాలను తరచూ పర్యవేక్షిం చాలని సూచించారు. సెల్ ఫోన్లతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి లేదని, ఎవరైనా తీసుకెళ్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులంతా కేటాయించిన పరీక్ష కేంద్రాలను ఒక రోజు ముందే సందర్శించి సౌకర్యాలపై సమీక్ష నిర్వహించాలని ఆదేశించారు. అధికారులు నిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పవన్ కుమార్ ఆర్డిఓ కే మహేశ్వర్, అడిషనల్ డీసీపీ జే కుమార్, మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ శ్రీలక్ష్మి, కొండగట్టు జెఎన్టియు ప్రొఫెసర్ బీ సతీష్ కుమార్, కలెక్టరేట్ సూపరిండెంట్ కాళీ చరణ్, తదితరులు పాల్గొన్నారు.