- – బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్
నేటి సాక్షి, కరీంనగర్: ఈనాడు గ్రూపు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ రామోజీరావు మరణం అత్యంత బాధాకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పత్రికా రంగంలో తనదైన పంథాతో చెరగని ముద్ర వేయడమే కాకుండా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించేవరకు వరకు విశ్రమించని యోధుడు అని చెప్పారు. మీడియా, వ్యాపార, సినీ రంగాల్లో అత్యద్బుతంగా రాణిస్తూ ఎంతో మందికి ‘మార్గదర్శి’గా నిలిచిన మహనీయుడని చెప్పారు. మీడియా మొఘల్‌గా పేరుగాంచిన రామోజీరావును కలిసినప్పుడల్లా ఎన్నో గొప్ప విషయాలు చెప్పేవారని గుర్తు చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయనతో కలిసి ‘చంద్రయాన్’ను వీక్షించడం మర్చిపోలేని అనుభూతి అని అన్నారు. తనలాంటి ఎందరికో మార్గదర్శిగా నిలిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రపంచంలోనే అత్యద్బుతమైన రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించి తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని అన్నారు. మాతృభాష పరిరక్షణకు నిరంతరం శ్రమించిన గొప్ప వ్యక్తి అని, మీడియా, చిట్ ఫండ్, ఫిల్మ్ సిటీ సహా అడుగుపెట్టిన ప్రతి వ్యాపార రంగంలోనూ అద్బుతంగా రాణిస్తూ తనదైన ముద్రవేసిన రామోజీరావు ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అలాంటి వ్యక్తి మరణం తీరనిలోటని చెప్పారు. రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులు మనోధైర్యంతో ముందుకుసాగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.

