- – మూడు సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన మల్లన్న
నేటి సాక్షి, హైదరాబాద్: నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిపై ఘన విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత అధికారులు విజయాన్ని ధ్రువీకరించారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ మెజార్టీ రాకపోవటంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. చివరగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ఎలిమినేషన్‌తో మల్లన్న విజయం దక్కించుకున్నారు. తీన్మార్ మల్లన్న గతంలో ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కూడా గట్టి పోటీ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. గతంలో మహబూబ్‌నగర్- రంగారెడ్డి – హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. మొత్తంగా 3 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసిన మల్లన్నను ఈసారి విజయం వరించింది. ఇక ఈ స్థానానికి మే 27న పోలింగ్ జరిగింది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 34 అసెంబ్లీ స్థానాల్లో 605 పోలింగ్ కేంద్రాల్లో ఉపఎన్నిక పోలింగ్ జరిగింది. ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు నిలిచారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. అయితే, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్యే ప్రధానంగా పోటీ నడిచింది. బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ఇక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ కుమార్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నారు.