- – మంత్రి పదవి లభించడంపై బండి స్పందన
నేటి సాక్షి, కరీంనగర్: ఈ రోజు తనకు లభించిన మంత్రి పదవి కార్యకర్తల కృషి ఫలితమేనని బండి సంజయ్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆదివారం ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మాట్లాడారు. ‘ఈ రోజు చాలా ఆనందంగా ఉంది.. నాపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.. ఈ రోజు నాకు లభించిన మంత్రి పదవి కార్యకర్తల కృషి ఫలితమే. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ముఖ్యంగా తనపై నమ్మకం ఉంచి, రెండోసారి భారీ మెజార్టీతో గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలవల్లే ఈ రోజు తనకు కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని చెప్పారు. ఎప్పటికీ కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. మంత్రిగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగిస్తాని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తాను కోరేదొక్కటేనని, ఎన్నికలప్పుడే రాజకీయాలు… వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలను పక్కనపెట్టి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో సహాయ సహకారాలందించేందుకు సిద్ధంగా ఉన్నాని తెలిపారు. అలాగే, తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని పేర్కొన్నారు.