- తెలంగాణలో మామిడికాయ
- ఆంధ్రాలో ఆవకాయ
- వక్కకారం అంటే-ఎంత మమకారం..!!

నేటి సాక్షి, కోరుట్ల : మామిడికాయ ‘వక్కకారం’ అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. ప్రతీయేటా వేసవికాలంలో మామిడికాయ వక్క.. సప్పడి తొక్కు.. తీపి వక్క..పెట్టుకోని తెలుగు మహిళలుండరు. తెలంగాణ ప్రాంతంలో ‘మామిడికాయ వక్కకారం’అని పిలుచుకుంటే.. ఆంధ్రాలో ‘ఆవకాయ పచ్చడి’గా పిలుచుకుంటుంటారు. వేడివేడి అన్నంలో అంచుకు ఇంత ‘వక్కకారం’ పెట్టుకుంటే.. ‘ఆహా-ఏమి రుచి’.. మైమరచి అనకుండా ఉండలేరు..!!
ఎగిలివారంగనే..
కైకిలివొయేటోళ్లు..
సద్దిడబ్బల ఇంత..
మామిడికాయ వక్కకారం ఏసుకుని నడ్తరు.!!

అంబటాళ్లకు..
ఇంటికచ్చి..
ఇంత అంబలో..
గంజినీళ్లో..మక్కగట్కనో
తిని పనికి వొయేటోళ్లూ..!
గిదే అక్కకారంతో కడుపునింపుకుని పోదురు నాటి కాలం నాడు.!!

గిప్పుడు గూడా..
గల్లీ నుండి గల్ఫ్ దాక..
గీ మాడికాయ వక్క- ఊరగాయతొక్కును..
డబ్బగిన్నెల ఏసుకుని ఉరుకుతరు..!!
కడుపుల ఆకలిలేకున్నా..
డబ్బగిన్నెల ఇంత తొక్కు..
పగటి బువ్వ యాళ్లదాక నోరూరిస్తూనే ఉంటది.!!
అంతెందుకు..
ఇంట్ల పొయిమీద..
కోడి కూర ఉడుకుతున్నా..
ఉడుకుడుకు అన్నంల నూనెనూనెసుంటి..
‘ఎర్రటిఊర్పు’ ఏసుకుని..
సల్లారకముందు వేడివేడిగా నాలుగు ముద్దలు తింటే..
హా..స్.స్.స్.స్.కా….రం….మ్.’ప్చ్’..అనిపించకమానదు.!!

చివరికి….
అజ్ఞాతంలో..
అడవిబిడ్డలను..
ఆదుకునేది కూడా
ఈ ‘వక్కకారమే’నన్నది ఎంత మందికి తెలుసు.?
వాడిపోయిన
‘మోత్కాకు’ల్లో..
నూనెను తీసేసిన..
ఎండిపోయిన వక్కకారంలో కాసిన్ని నీళ్లబొట్లు కలిపి..
ఆ కచ్చపక్క బువ్వలో ఏసుకుని దిక్కులు చూస్తూ తింటరు.దట్టమైన అడవిలోని గుట్టమీద అర్థరాత్రి దాటినంక..
అదో భయానకానుభవం.!!పండగైనా..
పబ్బమైనా..
ఫంక్షనైనా..
ఏ దైవకార్యమైనా..
మెస్ ల్లోనైనా/
అసలు కాలమేదైనా ఏడాదంతా..
భోజనంలోకి అంచుకు వక్కకారం (ఆవకాయ-పచ్చడి) ఉండాల్సిందే.!!
ఉగాదైనంక..
మామిడి పిందెలతో
‘లేతవక్క’పెడ్తరు..!!

ఇప్పుడు
ఏడాదికి సరిపడ
‘మడతమాన్ల'(జాడి)
నిండా వెట్టుకుంటరు..
అబ్బో ఇండ్ల రుచులే కాదు..రకాలూ ఎక్కువే..సప్పడితొక్కు.
బెల్లంతొక్కు..గుజ్జుతో/పైన తొక్కతో..స్వీటు..హాటు..
ఇంకా చాలానె ఉన్నాయ్.!!

మామిడికాయ వక్కకారం.
నవగ్రహ-స్వరూపం
వక్కకారంలో..
ఎరుపు..’రవి’
వేడి తీక్షణత..’కుజుడు’
నూనె,ఉప్పు..’శని’
పసుపు, మెంతులు..’గురువు’
ఆకుపచ్చ..’బుధుడు’
పులుపు..’శుక్రుడు’
మామిడికాయ తినగానే కలిగే
అలౌకికానందం..’కేతువు’
తిన్నకొద్దీ తినాలనే ఆశ..’రాహువు’
వక్కకారంలో కలుపుకునే అన్నం..’చంద్రుడు’.!!
ఈ ఆవకాయ
కంచంలో ఆగ్నేయ మూలవేసుకొని
నవగ్రహ స్తోత్రం
చెప్పుకొని తింటే
సమస్త గ్రహదోషాలు సమసిపోయాయనే
నానుడీ ఉంది.!

అంతా మన
మామిడికాయ వక్కకారం..దయా అంటుంటారు పెద్దలు..
అవన్నీ మాకేం తెల్వదు..అంబటాళ్ల గంజి బువ్వలో అంచుకు ఇంత ‘వక్కకారం’ఉంటే ..ఆహా..ఆ రుచే వేరయ్యా అంటుంటారు ఎవుసంజేసుకునెటోళ్లు..!!






