- – కరీంనగర్, వరంగల్ ఇన్చార్జి సీపీ అభిషేక్ మహంతి
నేటి సాక్షి, కరీంనగర్ క్రైం: మావోయిస్టు దంపతులు లొంగిపోయినట్టు కరీంనగర్, వరంగల్ ఇన్చార్జి సీపీ అభిషేక్ మహంతి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కరీంనగర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, లొంగిపోయిన దంపతుల వివరాలు వెల్లడించారు. ఆయన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సుదంపల్లి గ్రామానికి చెందిన తిక్క సుశ్మిత (28) ఇంటర్మీడియేట్ వరకు చదువుకున్నది. తన తండ్రి అయినా తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతిపరుడుగా పని చేశాడని, అతన్ని చూసి ఆకర్షితురాలైన సుష్మిత తన చదువు అనంతరం 2016లో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి గ్రామ అటవీప్రాంతంలో బడే చొక్కారావు @ దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా పరియా గ్రామానికి చెందిన మడకం దూల @ దూల ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. అతని అన్నయ్య ఐయేత 2008 సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరాడని, అతన్ని చూసి ఆకర్షితుడైన దూల 2015లో ఏరియా కమిటీ మెంబర్ అయిన జోగి ప్రోత్సాహంతో సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరాడు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి, 2020 మార్చి 30న పెండ్లి చేసుకున్నారు. తర్వాత వివిధ హోదాల్లో పలు చోట్ల పని చేశారు. మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం గురించి తెలుసుకుని ఆకర్షితులైన వీరిరువురు శుక్రవారం వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిపై రూ.4 లక్షల చొప్పున మనగదు రివార్డ్ ఉండగా, దానిని సీపీ వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ తిరుమల్, హసన్పర్తి ఇన్స్పెక్టర్ జే సురేష్ పాల్గొన్నారు.
లొంగిపోండి.. సమాజంలో కలవండి: సీపీ
మావోయిస్టులు లొంగిపోయి, సమాజంలో కలువాలని సీపీ అభిషేక్ మహంతి కోరారు. సమాజంలో చాలా మార్పులు వచ్చాయని, అభివృద్ధి వైపు నడిచేందుకు ముందుకు రావాలని ఆకాంక్షించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ సహాయంతో పాటు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.