- – సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్
నేటి సాక్షి, కరీంనగర్: జిల్లాల్లో ధరణి, ప్రజావాణి కార్యక్రమాల ద్వారా వచ్చే ఫిర్యాదులు దరఖాస్తులపై సత్వరమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను సీసీఎల్ఏ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి ఆయన కలెక్టర్లతో పెండింగ్ ధరణి, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం, భూముల మార్కెట్ విలువలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా నవీన్ మిట్టల్ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న ధరణి దరఖాస్తులు, మ్యుటేషన్ల పరిష్కారానికి మరోసారి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, అన్ని తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వారీగా ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రణాళిక బద్ధంగా కృషి చేయడంతో పాటు ప్రతిరోజు వచ్చే దరఖాస్తులను కలెక్టర్లు సమీక్షించాలని, అధికంగా పెండింగ్ ఉన్న మండలాలకు అవసరమైన అదనపు సిబ్బందిని కేటాయించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్రస్థాయిలో ప్రతి మంగళవారం, శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే భూసంబంధిత సమస్యలను సైతం కలెక్టర్లకు బదిలీ చేయడం జరుగుతుందని, వీటిని అత్యంత ప్రాధాన్యతతో సత్వర పరిష్కారం జరిగేలా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని, దీని కోసం జిల్లాలో భూముల మార్కెట్ విలువ, ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువ వివరాలతో కూడిన నివేదికను అందించాలని, మార్కెట్ విలువ నమోదులో ఎక్కడా స్థానికంగా ఎటువంటి వివాదాలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. సబ్ రిజిస్టర్ కార్యాయాల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, గంగాధరలలో అనువైన భవనం లేదా భూమి కేటాయించి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. సీసీఎల్ఏ నుంచి కలెక్టర్లకు రిటర్న్ వచ్చిన దరఖాస్తుల్లో అధికంగా ఆర్ఎస్ఆర్ దరఖాస్తులు, సంబంధిత ఆధారిత డాక్యుమెంట్లు జత చేయని దరఖాస్తులు ఉంటాయని అన్నారు. ఆర్ఎస్ఆర్ దరఖాస్తుల్లో తప్పుడు ఎంట్రీ జరిగిందా? ధ్రువీకరించి, తప్పుడు ఎంట్రీని తొలగించి, ఆర్ఎస్ఆర్ సవరణకు రిపోర్టుతో సహా దరఖాస్తులు పంపాలని కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ, జిల్లాలో పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కొరకు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టి, త్వరగా ఫైళ్లు డిస్పోజ్ చేసేలా చర్యలు చేపడుతామని, ఎప్పటి పనులు అప్పుడే పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైన మండలాలకు అదనపు సిబ్బందిని కేటాయించి దరఖాస్తులు వేగవంతంగా పరిష్కారం అయ్యేలా చూస్తామని అన్నారు. హుజూరాబాద్, గంగాధరలలో సబ్ రిజిస్టర్ కార్యాలయ ఏర్పాటుకు భవనం లేదా స్థలాన్ని గుర్తిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషన్ కలెక్టర్(రెవెన్యూ) లక్ష్మీకిరణ్, డీఆర్వో పవన్ కుమార్, కరీంనగర్, హుజూరాబాద్ ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

