- – ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు సీఎం ప్రశంసలు
నేటి సాక్షి, రాజేంద్రనగర్ : హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఆదివారం యూపీఎస్‌సీ రాయాల్సిన ఓ యువతిని సమయానికి పరీక్ష కేంద్రానికి చేర్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేశ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి అభినందించారు. ‘వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా.. సాటి మనిషికి సాయం చేయడం బాధ్యత అని భావించిన సురేశ్‌కు నా అభినందనలు’ అని ‘ఎక్స్’(ట్విట్టర్) వేదికగా ప్రశంసించారు. ఆ యువతి యూపీఎస్సీలో విజయం సాధించాలని కోరుకున్నారు. ‘ఆల్ ది బెస్ట్’ అంటూ కామెంట్ చేశారు.
– అసలేం జరిగింది..
ఆదివారం యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ పరీక్ష రాసేందుకు ఓ యువతి మహావీర్ ఇంజినీరింగ్ కళాశాలకు వెళ్లాల్సి ఉండగా, బస్సులో రావడంతో ఆమెకు ఆలస్యమైంది. మైలార్‌దేవుపల్లి పల్లెచెరువు బస్టాప్ వద్ద దిగగా, అప్పటికే పైగా సమయం మించిపోతుండటంతో ఆమె కంగారు పడింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న సురేశ్ ఇది గమనించి, ఏమైందని ఆరా తీశాడు. కంగారు పడకు తల్లీ.. నేను నిన్ను ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్తానని చెప్పి, పోలీస్ బైకుపై సరైన సమయానికి దిగబెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, చాలా మంది సురేశ్‌పై ప్రశంసలు కురిపించారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఆ కానిస్టేబుల్‌ను ఎక్స్ వేదికగా అభినందించారు.

