– జీడిపల్లి రాంరెడ్డి MA, MCJ, 9666680051
ఎక్కడ అయోధ్య.. ఎక్కడ తెలంగాణ సిద్దిపేట.. అయోధ్యలో రామమందిరం నిర్మించి సిద్దిపేట, తెలంగాణలో అక్షింతలు పంపిణీ చేసి జైశ్రీరామ్ నినాదం ద్వారా ఓటర్లను ప్రభావితం చేసి బీజేపీ ఓట్లు, సీట్లు దండుకోగా, రామమందిర నిర్మాణం జరిగిన అయోధ్యలో మాత్రం బీజేపీ ఓటమి పాలు కావడం ఆశ్చర్యానికి గురి చేసింది. అయోధ్య పరిధిలోని పైజాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి లల్లూసింగ్, ఎస్పీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ చేతిలో 65000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీన్ని బట్టి చూస్తే రామ మందిర నిర్మాణం ఉత్తర భారతంలో పెద్ద ప్రభావం చూపలేదు కానీ, దూరపు కొండలు నునుపు అన్నట్లు దక్షణ భారతంలోని తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపింది.. జీవితంలో బండ్లు ఓడలు అవుతాయి..ఓడలు బండు అవుతాయి.. ఇది వాస్తవం. రాజకీయాల్లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి కూడా..పరిస్థితులు కలిసి రానప్పుడు హేమా హేమీలు కూడా మట్టి కరుస్తుంటారు.. సామాన్యులు విజయం సాధిస్తుంటారు. ఇందిరమ్మ ప్రభంజనంలో ఎన్టీఆర్ తెలుగుదేశం ద్వారా ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. 2018లో చంద్రబాబును వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తుగా ఓడించగా, 2023లో అదే చంద్రబాబు కూటమి ద్వారా వైఎస్ జగన్మోహన్రెడ్డిని 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం చేసి ఘన విజయం సాధించారు. ఇక 2014, 2018 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కేసీఆర్
నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ 2022 ఎన్నికల్లో కేవలం 2 శాతం తేడాతో ఓటమి పాలైంది. ఎవరూ ఊహించని విధంగా రేవంత్రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. కేవలం 6 మాసాల తేడాతో ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల్లో సంచలన ఫలితాలు నమోదయ్యా యి. తెలంగాణలో అభ్యర్థులను మార్చుతే కేసీఆర్‌కు అధికారం వచ్చేది అని అంచనా రావడంతో జాగ్రత్త పడ్డ జగన్ అభ్యర్థులను పెద్ద ఎత్తున మార్చారు. రెడ్డి తదితర ఓసీలను కాదని, బీసీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు పెద్ద పీఠ వేశారు. ఎన్ని చేసినా కర్ణుని చావుకు 100 కారణాలన్నట్లు.. లేటు వయసులో చంద్రబాబు లెటెస్టుగా కూటమితో అధికారంలోకి వచ్చారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు.. ఊహకందని విధంగా రావడం జరిగింది. తెలంగాణలో బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చి పరువు దక్కించుకున్నా, ఆంధ్రలో మాత్రం కేవలం 11 సీట్లకు పరిమితం కావడంతో వైఎస్సార్సీపీ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఎం తప్పు చేశాం.. ఎందుకు ఇలాంటి పలితాలు వచ్చాయని జగన్ నుండి మొదలు కొని క్రింది స్థాయి కార్యకర్త వరకు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణకు పోటీగా ఆంధ్రలో సంక్షేమ జాతర సాగించారు జగన్. అన్ని వర్గాలకు వివిధ పథకాల రూపంలో నగదు ఖాతాల్లో పడేలా చూశారు. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి అధికార వికేంద్రీకరణ గావించి గ్రామాల్లోనే దృవీకరణ పత్రాలు అందేలా చూశారు. రేషన్, పించిన్ డబ్బులు ఇంటింటికి పంపేలా చేశారు. పాఠశాలలు బాగు చేసి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టారు. ఇంటి స్థలాలు ఇచ్చి పక్కా ఇండ్లు కూడా నిర్మించి ఇచ్చారు. ఇవన్నీ చేసినా.. ఎక్కడో ఒక చోట ప్రజలో నివురు గప్పిన నిప్పులా ప్రభుత్వంపై అసంతృప్తి ఉండటంతో వారు గ్రహించలేకపోయారు. సమన్వయంతో, హూందాగా మెలగాల్సిన మంత్రులు ఆంబోతుల్లా రంఖెలు వేయడం ప్రజలకు నచ్చలేదు. వీరికి దీటుగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడరాని భాషలో సమాధానం చెప్పినప్పటికీ ప్రజలు మాత్రం అధికార పార్టీ వైఖరిపై గర్హించారు. రాజదాని రద్దు తర్వాత ఏర్పాటు చేయకపోవడం, పట్టా పాస్ బుక్లపై ఆయన ఫోటో ముద్రించడం ద్వారా భూములు లాగేసుకుంటారని దుష్పచారం చేయడం, వైఎస్ వివేకానందరెడ్డి హత్య, జగన్‌కు వ్యతిరేకంగా షర్మిల ప్రచారం చేయడం, నూతన మద్యం పాలసీ విధానం, అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడటం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు తోడు బీజేపీ జత కట్టడంతో జగన్‌ను అధికారాన్ని దూరం చేశాయి. ఇక జాతీయ రాజకీయాల విషయానికి వస్తే అయోద్య రామ మందిర నిర్మాణం ప్రధాన అంశంగా జై శ్రీరామ్ నినాదంలో ఎన్నికల్లోకి వెల్లిన బీజేపీకి ఉత్తర భారతంలో గతంలో పోల్చితే సీట్లు తగ్గిపోగా, దక్షణ భారతంలో మాత్రం సీట్లు పెరగడం చూస్తే ఆయోద్య రాముడు కొలువు తీరిన ఉత్తర ప్రదేశ్లో ఫలించని జై శ్రీరామ్ నినాదం, దూరంలో ఉన్న దక్షణ భారతంలో పనిచేయడం చిత్రంగా ఉంది. 400 సీట్లు సాధిస్తామన్న ఎన్డీఏ కూటమికి 292 స్థానాలకే పరిమితం కావడం చూస్తే కమల వికాసంపై కలువరింత మొదలైంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీజేపేతర కూటమిగా ఏర్పాటైన ఇండియా కూటమికి 233 స్థానాలు రావడం చూస్తే భవిష్యత్లో పుంజుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. గతంలో భలంగా ఉన్న బీజేపీకి ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్‌లో ఎదురు గాలి వీచింది. ఎన్నడూ లేనంతగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో 9 స్థానాల్లో గెలుపొందిన బీఆర్ఎస్ పార్టీ ఈసారి ఒక్క సీటు కూడా గెలువలేక పోయింది. కాంగ్రెస్, బీజేపీ తలా 8 సీట్లలో, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించాయి. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పురుడు పోసుకున్న బీఆర్ఎస్ పార్టీ 2004 పార్లమెంటు ఎన్నికల్లో 5 స్థానాల్లో, 2009లో 2 స్థానాల్లో, 2014లో 11 స్థానాల్లో, 2019లో 9 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది. 2019లో 353 స్థానాలు గెలుచుకున్న బీజేపీ ఈసారి 400 స్థానాలే లక్ష్యం పెట్టుకోగా కేవలం 292 స్థానాలకే పరిమితమైంది. ఉత్తర భారతంలో ఈసారి బీజేపీకి అనుకున్న లక్ష్యం మేర ఓట్లు, సీట్లు సాధించలేకపోయింది. అయోద్య దేవాలయ నిర్మాణం ద్వారా జైశ్రీరామ్ నినాదాన్ని జాతీయ నినాదంగా మార్చుకోవాలని చూసిన బీజేపీకి ఉత్తర భారతంలో కలిసి రాకున్నా దక్షణ భారతంలో కొంత కలిసి వచ్చింది. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ 2019లో 62 స్థానాలు గెలుచుకోగా, నేడు కేవలం 33 స్థానాలకే పరిమతమైంది. నాడు వ్యతిరేక పలితాలతో ఖంగుతిన్న సమాజ్వాది పార్టీ నేడు 37 స్థానాలతో సత్తా చాటింది. పచ్చిమ బెంగాళ్ బీజేపీకి కేవలం 12 సీట్లు మాత్రమే రాగా, తృణమాల్ కాంగ్రెస్ పార్టీ 29 స్థానాలతో తిరుగులేని ఆధిక్యత సాధించింది. మహారాష్ట్రలో 2019లో ఎన్డీఏకు 43 సీట్లు రాగా, నేడు కేవలం 17 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. బీజేపీ 23 సీట్ల నుండి 9కి తగ్గిపోగా, కాంగ్రెస్ 1 సీటు నుండి 13కు పెరిగింది. ఓడిషా, మధ్యప్రదేశ్, గుజరాత్ లో బీజేపీ తిరుగులేని ఆధిక్యాన్ని కొనసాగించుకుంది. ఆయోధ్య రామ మందిరం నినాదాన్ని ఓటు బ్యాంకుగా మలుచుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది.అందులో బాగంగానే అక్షింతలను ఊరురా, పట్టణాల్లో పంపిణీ చేయడం జరిగింది. అయితే రామమందిర నిర్మాణం జరిగిన అయోధ్యలోని పైజాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి లల్లూసింగ్, ఎస్పీ అభ్యర్థి అవదేశ్ ప్రసాద్ చేతిలో 65000 ఓట్ల తేడాతో ఓటమి పాలు కావడం కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. దీన్ని బట్టి చూస్తే రామ మందిర నిర్మాణం ఉత్తర భారతంలో పెద్ద ప్రభావం చూపలేదు కానీ, దూరపు కొండలు నునుపు అన్నట్లు దక్షణ భారతంలోని తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపింది. తమిళ నాడులో మాజీ గవర్నర్ తమిళసైని రంగంలో దించినా జీరోకే పరిమితమైంది. డీఎంకే అక్కడ 22 స్థానాల్లో హవా చూపడం జరిగింది. గతంలో అన్నాడీఎంకే అధికారంలో ఉండగా జీరోకు డీఎంకే పరిమితం కాగా, నేడు అన్నాడీఎంకే జీరోకు పరిమితమైంది. బీజేపీ వారణాసిలో మోదీ గతంలో 4.79 లక్షల మెజారిటీ సాధించగా, నేడు కేవలం 1.50లక్షల మెజారిటీ రావడంతో రానురాను మోదీ ప్రభ మసకబారినట్లు కనిపిస్తుంది. మోదీకి మెజారిటీ తగ్గుతూ వస్తుండగా, తెలంగాణ, ఆంధ్రలో మాత్రం మోదీ ప్రభావంతో అనూహ్య పలితాలు రావడం గమనార్హం. తెలంగాణలో పట్టణ ఓటర్లు బీజేపీకి జై కొట్టాయి. తెలంగాణ ఉద్యమం నుండి మొన్నటి వరకు బీఆర్ఎస్కు కంచుకోటగా ఉన్న సిద్దిపేటలో బీజేపీ గణనీయమైన ఓట్లను సాధించింది. అక్కడ బీఆర్ఎస్కు స్వల్ప ఆధిక్యత లభించింది.
హరీశ్ రావుకు అండగా నిలిచే సిద్దిపేట ప్రజలు బీజేపీకి ఎందుకు అండగా నిలిచారు.. ? గతంలో మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపును శాసించే సిద్దిపేట లో మోదీ, జై శ్రీరామ్ నినాదాలతో అలాంటి పరిస్థితి రావడానికి కారణమైంది. మొత్తం తెలంగాణలో సిద్దిపేట, గజ్వెల్, దుబ్బాక నియోజకవర్గాలు మినహా ఎక్కడా కూడా బీఆర్ఎస్ కు ఆధిక్యత ఇవ్వలేదంటే ఎలాంటి ప్రభావం చూపిందో అర్థం కావడం లేదు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రాంతాల్లో ఆధిక్యతను కోల్పోయింది. ఆర్మూర్, బోధన్ లాంటి స్థానాల్లో 10000 లోపుకు ఓట్లు రావడం విచారించాల్సిన విషయం. సిద్దిపేట కూడా పెద్ద పట్టణం కావడంతో ఆప్రభావంతోనే బీఆర్ఎస్ ఆధిక్యతకు గండి కొట్టడం జరిగింది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం లేకపోవడంతో పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీల వైపు ఓటర్లు మొగ్గు చూపినట్లు కనిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపడంతో 8 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించారు. రాజకీయాలు అన్నాక గెలుపోటములు సహజం. గత పదేళ్లుగా బీఆర్ఎస్ హవాలో కాంగ్రెస్, బీజేపీలు కనుమరుగైన విషయం తెలిసిందే. గ్రామ స్థాయిలో వార్డు మెంబర్ నుండి కార్పోరేషన్ల చైర్మన్ల వరకు బీఆర్ఎస్ వారే గెలుపొందారు. ఆసమయంలో కాంగ్రెస్, బీజేపీ పని అయింది అనుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయింది అనుకున్నారు.. ఏమైంది. వారు తగినంత ప్రచారం చేయకున్నా ప్రజలే వారికి అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రజలు తలుచు కుంటే ఎమన్నా చేయగలరు. గెలుపోటములు సహజంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మద్య హోరాహోరీ పోటీ తప్పదు. చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అత్యధిక ఎంపీ సీట్లను సాధించి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తే తెలంగాణలో మాత్రం ప్రజలు జాతీయ పార్టీలకే పట్టం కట్టారు. ఎంపీ సీట్లలో కొన్ని బీఆర్ఎస్కు వస్తే జాతీయ స్థాయిలో ప్రాధాన్యత లభించేది. ఏది ఏమైనా గులాబీ బాస్ కేసీఆర్‌కు గెలుపోటములు కొత్తకావు. తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకొచ్చారు. అధికారం లేకపోయినా ఇప్పటికీ తెలంగాణలో ప్రజల ముఖ్యమంత్రిగా కేసీఆర్ చెరుగని ముద్ర వేశారు. జరిగిన లోటుపాట్లను సరిదిద్దుకొని ముందుకు సాగుతే బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్లో తిరుగుండదనే విషయం మరువరాదు.