- – రాష్ట్ర మంత్రులకు పరిధులు నిర్ణయించడానికి మీరెవరు?
- – మంత్రి పొన్నంపై మేయర్ సునీల్రావు ఆరోపణలను ఖండించిన కోమటిరెడ్డి
నేటి సాక్షి, కరీంనగర్: బల్దియాలో జరిగిన అవినీతిపై విచారణ అంటే మేయర్ ఎందుకు ఉలికిపడుతున్నారని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. బల్దియాలో ఐదేండ్లుగా జరుగుతున్న అవినీతిపై ఎన్నో సార్లు నగర కాంగ్రెస్ పక్షాన ప్రశ్నించామని, సాక్షాధారాలతో నిరూపించామని, ఆ అవినీతిపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశిస్తే, మేయర్ సునీల్రావు పరిస్థితి దొంగ దొంగా అంటే భుజాలు తరుముకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. బుధవారం నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రులకు పరిధులు నిర్ణయించే స్థాయి మేయర్ సునీల్ రావుకు లేదని స్పష్టం చేశారు. బాధ్యతగల పదవిలో ఉన్న సునీల్ రావు.. మంత్రి విచారణకు ఆదేశించిన వాటికి సహకరరించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. అప్పట్లో ఎంపీ బండి సంజయ్‌పై అభివృద్ధికి సహకరిస్తలేడని ఎన్నోసార్లు ఆరోపణలు చేశారని, ఇప్పుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి కాగానే అభివృద్ధిలో బండి సంజయ్ పాత్ర ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం సునీల్ రావు నైజం ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు తాజొద్దీన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ నాయక్, సయ్యద్ ఖమ్రొద్దీన్, కొట్టే ప్రభాకర్, అస్తపురం రమేశ్, బషీర్, మహమ్మద్ బారీ, ఇమ్రాన్, భరత్ తదితరులు పాల్గొన్నారు.