- – మీపై లాఠీదెబ్బలు, కేసులు, జైళ్లతోనే నాకీ గుర్తింపు
- – కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి దాకా ఎదగడం బీజేపీలోనే సాధ్యం
- – మోదీ.. అమిత్ షా, జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు
- – రాష్ట్రాభివృద్ధికి, కరీంనగర్ పార్లమెంట్‌కు అధిక నిధులు తెస్తా
- – నా శక్తివంచన లేకుండా ప్రజల కోసం పనిచేస్తా
- – రేపటి ‘సెల్యూట్ తెలంగాణ’కార్యక్రమానికి తరలిరండి
- – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
- – కేంద్ర మంత్రిగా తొలిసారి కరీంనగర్లో అడుగుపెట్టిన బండికి అపూర్వ స్వాగతం
నేటి సాక్షి, కరీంనగర్: తనకు కేంద్ర మంత్రి పదవి దక్కడం కరీంనగర్ ప్రజలతోపాటు కార్యకర్తలు పెట్టిన భిక్షేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ‘కార్యకర్తలారా… ఆనాడు నాతో కలిసి మీరు కేసీఆర్ మూర్ఖపు పాలనపై పోరాడితే లాఠీదెబ్బలు తిన్నరు. కేసులు ఎదుర్కొన్నారు. జైళ్లకు వెళ్లారు. రక్తం చిందించారు. ప్రజా సంగ్రామ యాత్రలో నాతో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ కష్టాలను లెక్క చేయకుండా 155 రోజులపాటు 1600 కిలోమీటర్లకుపైగా నడిచారు. పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డారు. అందుకే ఈరోజు నాకీ పదవి వచ్చింది. ఈ పదవి మీరు పెట్టిన భిక్షే. ప్రజలకు, కార్యకర్తలకే ఈ పదవిని అంకితమిస్తున్నా’అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా తొలిసారి కరీంనగర్‌కు వచ్చిన బండి సంజయ్‌కు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కరీంనగర్లో మీడియాతో బండి సంజయ్ మాట్లాడారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి కరీంనగర్‌కు వచ్చానని చెప్పారు. ఈ సందర్భంగా కరీంనగర్‌కు, తెలంగాణ రాష్ట్రానికి సెల్యూట్ చేస్తున్నా. ఈ పదవి వచ్చిందంటే కరీంనగర్ ప్రజలు పెట్టిన భిక్షే. ప్రజలు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించడంతోనే ఈ రోజు మంత్రిగా మీ ముందున్నా.. అని అన్నారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగానంటే.. ఇది కేవలం బీజేపీవల్లే సాధ్యమైందని, అమ్మవారి ఆశీస్సులతోనే సాధ్యమైందని చెప్పారు. ముఖ్యంగా తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై ప్రయోగించిన లాఠీదెబ్బలకు నాకు గుర్తింపు వచ్చిందన్నారు. బీఆర్ఎస్ మూర్ఖత్వ పాలనను నిరసించిన కార్యకర్తలను జైలుకు పంపడం ద్వారా నాకు గుర్తింపు వచ్చిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న బీజేపీ కార్యకర్తలపై రౌడీషీట్లు తెరిచినందున నాకు గుర్తింపు వచ్చిందన్నారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో 155 రోజులు పాదయాత్ర చేసి 1600 కిలో మీటర్లు తిరిగితే.. నా అడుగులో అడుగు వేసి కార్యకర్తలు నడిచినందునే ఈ పదవి వచ్చిందని చెప్పారు. అందుకే ఈ పదవి కార్యకర్తలకే అంకితమని, కార్యకర్తలు తన పక్షాన ఉండకుంటే.. లాఠీదెబ్బలు తినకుంటే, జైలుకు వెళ్లకుంటే తనకు ఈ గుర్తింపు వచ్చేది కాదని అన్నారు. కేంద్ర మంత్రి పదవి అధికారం కోసమో, పదవులు అనుభవించడానికో.. అక్రమంగా సంపాదించుకోవడానికో కాదని, దేశ, ధర్మ రక్షణ, సమాజ సంఘటితం కోసమని అన్నారు. తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం కోసం ఉపయోగిస్తానని, రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ పదవిని ఉపయోగిస్తాని స్పష్టం చేశారు. ‘నేను సిద్ధాంతం కోసం పనిచేసే కార్యకర్తను. దేశం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా.. మోదీ, అమిత్‌షా ఆదేశాల మేరకు పనిచేస్తా.. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తా’నని చెప్పారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని, ఎన్నికల తర్వాత పూర్తిగా తెలంగాణ, కరీంనగర్ అభివృద్ధి కోసమే పనిచేస్తాని స్పష్టం చేశారు. రేపు కిషన్‌రెడ్డి రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో ఆయనతో కలిసి బేగంపేట విమానాశ్రయం నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వెళుతున్నానని, ‘సెల్యూట్ తెలంగాణ’ పేరుతో నిర్వహించే ఈ కార్యక్రమానికి తెలంగాణలోని ప్రతి ఒక్కరూ తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.